తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరుగుతోన్న హిమనీనదాలు- పొంచి ఉన్న ప్రళయాలు

రోజురోజుకూ పెరుగుతున్న భూతాపం.. హిమాలయాల పట్ల అశనిపాతమవుతోంది. హిమనీనదాలన్నీ కరిగిపోతున్నాయి. 21వ శతాబ్దం ఆరంభం నుంచి ఏటా ఒకటిన్నర అడుగు మేర హిమాలయాల్లో మంచు కుచించుకుపోతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో భారత్ సహా అనేక దేశాల్లో కోట్లాది మంది నీటికి కటకటలాడాల్సి వస్తుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

Himalayas
కరిగిపోతోన్న హిమనీనదం

By

Published : Feb 7, 2021, 6:21 PM IST

ఉష్ణోగ్రతల్లో పెరుగుదలతో 21వ శతాబ్దం ఆరంభం నుంచి హిమాలయాలు అంతకు ముందుకంటే రెండింతలు ఎక్కువగా కరుగుతున్నాయని 2019లో నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. ఏటా ఏడాదిన్నర అడుగు మేర హిమం కరుగుతున్నట్లు ఆ సర్వే తెలిపింది. ఇది ఇలాగే కొనసాగితే భారత్ సహా అనేక దేశాలు తీవ్రమైన దుర్భిక్షాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. 40 ఏళ్లుగా భారత్‌, చైనా, నేపాల్‌, భూటాన్ పరిధిలోని హిమాలయాల ఉపగ్రహ ఛాయాచిత్రాలను పరిశీలిస్తే మారుతున్న వాతావరణ పరిస్థితులు హిమాలయాలను తినేస్తున్న విషయం అర్థం అవుతుందని పరిశోధకులు అంటున్నారు.

2019 జూన్‌లో 'సైన్సెస్ అడ్వాన్సెస్‌' అనే జర్నల్‌లో ప్రచురితమైన కథనం మేరకు 2వేల సంవత్సరం నుంచి హిమాలయాల్లో మంచు ఏటా ఒకటిన్నర అడుగు మేర తరిగిపోతోంది. 1975 నుంచి 2000 వరకు కరిగిన మంచుతో పోల్చితే ఇది రెండింతలుగా ఉందని అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు చెప్పారు.

హిమనీనదం

హిమాలయాలు ఏ మేరకు మంచును కోల్పోయాయన్నది పూర్తిస్థాయిలో పరిశోధన చేయనప్పటికీ మొత్తం పరిమాణంలో నాలుగోవంతు కోల్పోయి ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కాలమాన పరిస్థితులు మారేకొద్దీ హిమాలయాల్లో మంచు కరగడం అన్నది క్రమంగా పెరుగుతూనే ఉందని తెలిపారు. ఈ పరిస్థితికి భూతాపమే కారణమని చెప్పారు. ప్రాంతాన్ని బట్టి ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉన్నప్పటికీ 1975- 2000 మధ్య సమయంతో పోల్చితే.. 2000 నుంచి 2016 మధ్య సరాసరిన ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ పెరిగాయని అన్నారు. హిమాలయాల్లో పశ్చిమం నుంచి తూర్పు వరకు 2 వేల కిలోమీటర్ల పరిధిలో 650 హిమనీనదాల ఉపగ్రహఛాయా చిత్రాలను సంపూర్ణంగా పరిశీలించినట్లు పరిశోధకులు వివరించారు.

కరిగిపోతోన్న హిమనీనదం

20వ శతాబ్దంలోని ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఎక్కువగా అమెరికా నిఘా ఉపగ్రహాల నుంచి సేకరించారు. వీటిని ఆటోమేటెడ్ వ్యవస్థ ద్వారా 3-డీ శైలిలోకి మార్చి 21 వ శతాబ్దంలోని ఉపగ్రహ ఛాయాచిత్రాలతో పోల్చి చూసినట్లు పరిశోధకులు చెప్పారు. ఈ క్రమంలో 1975 నుంచి 2వేల సంవత్సరం వరకు మంచు పర్వతాలు సరాసరిన 0.25 మీటర్ల మేర కరిగాయని గుర్తించారు. 1990ల నుంచి 2 వేల వరకు ఉష్ణోగ్రతలతో పాటు మంచు చరియలు కరగడం ఎక్కువైనట్లు తెలిపారు. 2వేల సంవత్సరం తర్వాత అది రెండింతలు పెరిగి అరమీటరు మేర మంచు కరిగిపోయినట్లు తెలిపారు. ఆసియా దేశాల్లో శిలాజ, జీవ వ్యర్థాల ఇంధన వినియోగం పెరిగి వాటి నుంచి వెలువడే వాయువుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగాయని.. అది హిమాలయాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని పరిశోధకులు పేర్కొన్నారు.

హిమాలయాల్లో హిమనీనదాలు

ఆల్ఫ్స్‌ పర్వతాల్లో మంచుతో పోల్చితే హిమాలయాలు అంత వేగంగా కరిగిపోనప్పటికీ పరిస్థితి మాత్రం రెండింటి విషయంలో ఒకేలా ఉందని పరిశోధకులు వివరించారు. అయితే ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు.. ఆసియా పరిధిలోని పామిర్‌, హిందూఖుష్‌ లేదా తియాన్ షాన్ పర్వతాల్లో మంచు చరియలు కరగడంపై దృష్టి సారించనప్పటికీ.. ఇతర పరిశోధనలు మాత్రం అక్కడ కూడా మంచు భారీగానే కరుగుతున్నట్లు వెల్లడించాయి. హిమాలయాల్లోని హిమనీనదాల నుంచి వచ్చే నీరే 80 కోట్ల మంది సాగు, తాగు, విద్యుత్ అవసరాలు తీర్చుతున్నాయి. హిమాలయాలు ఇదే స్థాయిలో కరుగుతూ పోతే ఆయా ప్రాంతాల్లో కరవుఛాయలు కమ్ముకుంటాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details