హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా.. మశ్రూమ్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందింది. ఈ బిరుదు వెనక ఖుంబా పరిశోధన కేంద్రం కృషి ఎంతో ఉంది. అసలు సోలన్‌కు ఆ పేరెలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఖుంబా పరిశోధన కేంద్రం గురించి తెలుసుకోవాల్సిందే. సోలన్‌లోని భారత పరిశోధన కేంద్రంలో పుట్ట గొడుగులపై పరిశోధనలు 1961లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 1983లో ప్రత్యేకంగా పుట్టగొడుగుల కోసమే ఖుంబా రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 1997 సెప్టెంబర్‌లో సోలన్‌కు ఫేమస్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొచ్చింది. ఇప్పటివరకూ ఖుంబా కేంద్రంలో 30 జాతుల పుట్టగొడుగులను కనుగొన్నారు. 4 ఏళ్ల నిరంతర పరిశోధన తర్వాత.. ఇటీవలే గ్రిఫోలా రకం పుట్టగొడుగులను ఉత్పత్తి చేశారు పరిశోధకులు.
గత మూడు నాలుగేళ్లలో గ్రిఫోలా ఫ్రండోజా అనే కొత్తరకం పుట్టగొడుగును ఉత్పత్తి చేయడంలో విజయం సాధించాం. ఈ రకం పుట్టగొడుగుల్లో పుష్కలమైన ఔషధ గుణాలున్నాయి. క్యాన్సర్, మధుమేహం లాంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడి, ఊపిరితిత్తులను కాపాడే గుణాలు ఈ పుట్టగొడుగులో ఉన్నాయి.
--డా. సతీష్ శర్మ, శాస్త్రవేత్త.
గ్రిఫోలా పుట్టగొడుగుల్లో విటమిన్లు, లవణాలు పుష్కలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీటిలో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి.
ఈ పుట్టగొడుగును కలినరీ మెడిసినల్ మశ్రూమ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఏ రూపంలోనైనా దీన్ని తీసుకోవచ్చు. గనోడర్మా కూడా ఔషధ విలువలున్న పుట్టగొడుగే కానీ దాన్ని మనం తినలేం. ఎందుకంటే చాలా చేదుగా ఉంటుంది. మనం పండించే పుట్టగొడుగులను కూరగాయలుగా వినియోగించుకోవచ్చు. ఎవరైనా తినొచ్చు దీన్ని. వాటిని ఎండబెట్టి, తర్వాత కూడా వాడుకోవచ్చు. పూర్తిగా ఎండిన తర్వాత పొడిగానైనా వాడుకోవచ్చు, రీహైడ్రేట్ చేసి, మళ్ళీ కూరగానైనా వండుకోవచ్చు.
--డా. సతీష్ శర్మ, శాస్త్రవేత్త
చైనా, జపాన్ దేశాలు ఎన్నో ఏళ్లుగా ఈ పుట్టగొడుగులు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం డీఎమ్ఆర్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో ఔషధ గుణాలున్న గ్రిఫోలా పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రకం పుట్టగొడుగుల పెంపకంలో రైతులకు శిక్షణనిచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు.