Floods In Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రావి, బియాస్, సట్లెజ్, స్వాన్, చీనాబ్ సహా అన్ని ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శిమ్లాలో కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత రెండు రోజుల్లో హిమాచల్‌లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 17కి చేరింది. నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి ఇళ్లు, భారీ వాహనాలు కొట్టుకుపోతున్నాయి. అనేక రహదారులపై కొండచరియలు విరిగిపడటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి.
50 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
Himachal Pradesh Rains History : హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైంది. నదులు మహోగ్ర రూపం దాల్చాయి. వరదల ధాటికి అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. ఆకస్మిక వరదల ధాటికి ఇళ్లు, భారీ వాహనాలు కొట్టుకుపోయాయి. పర్యాటక పట్టణం మనాలిలో వరదల్లో చిక్కుకుపోయిన 20 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. వివిధ ప్రాంతాలలో మొత్తంగా 300 మంది వరదల్లో చిక్కుకున్నారని వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. శిమ్లాలోని థియోగ్ సబ్‌డివిజన్‌లో ఉదయం కొండచరియలు విరిగిపడటం వల్ల ముగ్గురు వ్యక్తులు మరణించారు.
రికార్డు స్థాయిలో కురుస్తున్న భారీ వర్షాలకు హిమాచల్ ప్రజలు అల్లాడిపోతున్నారు. గత 48 గంటల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు 20, ఆకస్మిక వరదల ఘటనలు 17 నమోదైనట్లు అధికారులు తెలిపారు. 876 బస్సు మార్గాలు దెబ్బతిన్నాయని, 403 బస్సులు వివిధ ప్రదేశాల్లో నిలిచిపోయాయని హిమాచల్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ప్రకటించింది.
ఆ మార్గం మూసివేత..
Himachal Pradesh Roads Closed : కొండచరియలు విరిగిపడ్డ కారణంగా మొత్తం 765 రోడ్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. 484 నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. చండీగఢ్-మనాలి జాతీయ రహదారిపై చాలా చోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల అధికారులు రోడ్డును బ్లాక్ చేశారు. సిమ్లా-కిన్నౌర్ రహదారిపై రాళ్లు పడటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తించిన సిమ్లా-కల్కా మార్గంలో రైలు రాకపోకలను మంగళవారం వరకు నిలిపివేస్తునట్లు అధికారులు తెలిపారు.