Himachal Pradesh Rain News in Telugu : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా కొండచరియలు విరిగిపడ్డ శిమ్లాలోని సమ్మర్ హిల్స్ ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద నుంచి ఇప్పటివరకు 21 మృతదేహాలను బయటకు తీశారు. ఇదిలా ఉండగా.. సమ్మర్ హిల్స్ వద్ద బుధవారం ఉదయం మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు.
Himachal Pradesh Flood News : హిమాచల్ ప్రదేశ్‌లో గత మూడు రోజుల్లో సాధారణ కన్నా 157 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖువెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 1200 రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు. వాటిలో 400 రహదారులకు మరమ్మతులు చేసి పునరుద్ధరించినట్లు వివరించారు. ఖాంగ్రాలోని పోంగ్ జలాశయం వద్ద లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సుఖు వెల్లడించారు. దాదాపు 800 మంది ప్రజలను తరలించినట్లు చెప్పారు. డ్యామ్ నుంచి నీటిని వదిలితే.. ఈ గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయని.. అందువల్లే ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంత ప్రజలను వేరే చోటికి తరలించినట్లు స్పష్టం చేశారు.
కొండచరియలు విరిగి శివాలయంపై పడ్డ ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచే సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మృతదేహాలేవీ కనిపించలేదని చెప్పారు. ఆర్మీకి చెందిన ఓ యంత్రాన్ని సైతం సహాయక చర్యలకు వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఇక్కడ నాలుగు మృతదేహాలు వెలికి తీశారు. దీంతో ఇప్పటివరకు బయటకు తీసిన మృతదేహాల సంఖ్య 12కు చేరింది.
కాగా, ఈ సారి రాష్ట్రంలో మొత్తం 170 కుంభవృష్టిలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. దాదాపు 9,600 ఇళ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా శిమ్లా, సోలన్, మండీ, హమీర్‌పుర్, కాంగ్రా జిల్లాల్లో నష్టం అధికంగా ఉంది.
కుప్పకూలిన భవనం
Uttarakhand Flood 2023 :ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు ఇల్లు కూలిన ఘటనలో ఒకరు చనిపోయారు. ముగ్గురిని సహాయక బృందాలు కాపాడాయి. చమోలీ జిల్లా జోషీమఠ్‌లోని హెలాంగ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అలకనంద నది ఒడ్డున ఉన్న రెండంతస్తుల భవనం మంగళవారం సాయంత్రం కుప్పకూలిందని అధికారులు తెలిపారు. కొందరు స్థానికులు ఆ భవన శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు ముగ్గురిని కాపాడాయని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయని అధికారులు వివరించారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఈ వర్షాకాల సీజన్లో వివిధ ఘటనల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.