Himachal Pradesh Landslide Today : హిమాచల్ ప్రదేశ్ రాజధాని శిమ్లా సమ్మర్ హిల్లో ఉన్న ఓ శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 25 మంది భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. దీనిపై సమాచారం అందుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం 15 మందిని రక్షించారు. వారిని ఐజీఎంసీ శిమ్లా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు తొమ్మిది మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
శివాలయంపై విరిగిపడిన కొండచరియలు ఆగస్టు 14న శ్రావణ సోమవారం కావడం వల్ల ఉదయం నుంచే శివాలయానికి ఎక్కువగా భక్తులు వచ్చారు. ఘటన జరిగినప్పుడు ఆలయం వద్ద దాదాపు 50 మంది వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలాలను తొలగించి ప్రజలను రక్షించేందుకు స్థానిక యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోందని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, మంత్రి విక్రమాదిత్య సింగ్.. ఘటన స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
నష్టాలపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నివేదిక..
Himachal Pradesh Monsoon 2023 Losses : ఈ ఏడాది వర్షాకాలంలో జరిగిన నష్టాలపై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. ఓ నివేదిక విడుదల చేసింది. జూన్ 24 నుంచి ప్రారంభమైన వర్షాకాలంలో.. సంభవించిన వరదలు, విరిగిపడ్డ కొండచరియల కారణంగా చనిపోయిన వారి, ఇతర బాధితుల లెక్కలు వెల్లడించింది. అందుకు సంబంధిచిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- రూ.7020 కోట్ల ఆస్తి నష్టం జరిగింది.
- 257 మంది చనిపోయారు.
- మరో 32 మంది గల్లంతయ్యారు.
- 290 మంది గాయపడ్డారు.
- 191 మంది రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల మృతి చెందారు.
- మొత్తం 1,376 ఇళ్లు పూర్తిగా.. 7,935 పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
- 270 దుకాణాలు, 2,727 గోశాలలు ధ్వంసమయ్యాయి.
- 90 కొండచరియలు విరిగిపడిన ఘటనలు జరిగాయి.
- 55 సార్లు ఆకస్మిక వరదలు సంభవించాయి.
- ఇప్పటికీ 450 రోడ్లు.. రెండు జాతీయ రహదారులు మూసివేసి ఉన్నాయి.
శివాలయంపై విరిగిపడిన కొండచరియలు
హిమాచల్లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఇళ్లు.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
డబ్బులివ్వలేదని దారుణం.. యువకుడి జననాంగంపై కత్తితో దాడి.. డ్యూటీ నుంచి వెళ్తుండగా..