Himachal Pradesh Floods Update : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 55 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. రోడ్లపై కొండచరియలు విరిగిపడటం వల్ల రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు కూలిపోయాయి. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు, రాష్ట్రంలో ఆగస్టు15వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం లేదని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు.
కూలిన శివాలయం.. 9 మంది మృతి..
Himachal Pradesh Floods Death : హిమాచల్ ప్రదేశ్ రాజధాని శిమ్లా సమ్మర్ హిల్‌లో ఉన్న ఓ శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సందర్శించారు. ఈ ఘటనలో 9 మంది చనిపోయారని తెలిపారు. శిథిలాల కింది నుంచి మృతదేహాలను బయటకు తీసినట్లు తెలిపారు. మరో 12 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారని.. వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. స్థానిక యంత్రాంగం శిథిలాలను తొలగించేందుకు తీవ్రంగా కృషి చేస్తోందని అన్నారు. శిమ్లా సమీపంలోని ఫగ్లీ ప్రాంతంలోనూ కొండచరియలు విరిగిపడి అనేక ఇళ్లు బురదలో కూరుకుపోయాని ముఖ్యమంత్రి తెలిపారు.
ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి..
సోలన్ జిల్లాలోని జాడోన్ గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో సహాయక సబ్బంది ఆరుగురిని రక్షించారు. ఒకే కుటుంబానికి చెందిన మరో ఏడుగురు చనిపోయారు. మృతులను హర్నం (38), కమల్ కిశోర్ (35), హేమలత (34), రాహుల్ (14), నేహా (12), గోలు (8), రక్ష (12)గా గురించినట్లు సోలన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ సింగ్‌గా వివరాలు వెల్లడించారు.
బలెరా గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఇల్లు కూలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. రామ్షెహర్ మండలంలోని బనాల్ గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఓ మహిళ చనిపోయిందని సోలన్ డిప్యూటీ కమిషనర్ మన్మోహన్ శర్మ తెలిపారు.