ప్రతిసారి ప్రతిపక్ష పార్టీకి అధికారం ఇస్తూ మార్పును కోరుకునే హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఈ సారి ఎలాంటి తీర్పును ఇస్తారనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. మార్పు కోరుకుని కాంగ్రెస్‌కు అధికారం ఇస్తారా? లేక సంప్రదాయాన్ని మార్చి కాషాయదళానికి మరోసారి అవకాశం ఇస్తారా? అనే ప్రశ్నలకు ఓట్ల లెక్కింపు ప్రారంభై గంటలు గడుస్తున్నా ఇంకా సమాధానం లభించడంలేదు. విజయం నీదా? నాదా? అన్నట్లుగా కాంగ్రెస్, భాజపా పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇరు పార్టీలు దాదాపు సమాన స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నాయి. చివరకు ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇతరులు అతి కొద్ది సీట్లలో ముందంజలో ఉన్నారు. హంగ్ తరహా పరిస్థితి ఏర్పడితే.. వీరే కింగ్ మేకర్స్ కానున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే కనీసం 35 నియోజకవర్గాల్లో విజయం సాధించడం తప్పనిసరి.
హిమాచల్‌లో భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ.. వారే కింగ్ మేకర్స్!
హిమాచల్ ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇరు పార్టీలు దాదాపు సమాన స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నాయి. చివరకు ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
భాజపా ప్లాన్-బి సిద్ధం చేసినా..
గుజరాత్లో భాజపాదే పీఠమని అంచనా వేసిన ఎగ్జిట్‌పోల్స్.. హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం కమలదళం, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉందని తెలిపింది. దీంతో అధికార భాజపా ఇప్పటికే రాష్ట్రంలో 'ప్లాన్-బి' మొదలుపెట్టిందని సమాచారం. స్వతంత్ర అభ్యర్థులు, రెబల్స్‌తో రాష్ట్ర నేతలు విస్తృత చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హంగ్ ఏర్పడితే వీరిలో ఎంత మందిని భాజపా తమవైపునకు తిప్పుకోగలదో వేచి చూడాలి.
కాంగ్రెస్ సైతం ఇదే తరహా కసరత్తు చేస్తోంది. ముందుగా తమ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థుల్ని కాపాడుకునేందుకు వారిని రహస్య ప్రదేశానికి తరలించాలని భావిస్తున్నట్లు తెలిసింది.