తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిమాచలంలో రాచరికం నెగ్గేనా? మార్పు వస్తుందా? - himachal pradesh polling

Himachal Pradesh Election 2022 : హిమాచల్​ ప్రదేశ్ రాజకీయాల్లో రాజ కుంటుంబాల ప్రభావం ఇంకా కొసాగుతోంది. ఇప్పుడు ఇదే భాజపాకు ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారింది. కాంగ్రెస్​ టిక్కెట్లు ఇచ్చిన రాజకుంటుంబాలకు చెందిన అభ్యర్థులే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఈసారి ఎన్నికల్లో హిమాచల్​లో రాచరికం నెగ్గుతుందా? మార్పు వస్తుందా? అనే ప్రశ్నలు ఆసక్తిగా మారాయి.

himachal pradesh election 2022 monarchy politics
himachal pradesh election 2022 monarchy politics

By

Published : Nov 6, 2022, 7:01 AM IST

Updated : Nov 6, 2022, 7:31 AM IST

Himachal Pradesh Election 2022 : హిమాచల్‌ ప్రదేశ్‌లో రాచరికం ప్రజాస్వామ్య పరీక్షనెదుర్కొంటోంది. ఒకనాటి సంస్థానాధీశులు, రాజకుటుంబీకులు అనేక మంది ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజామోదాన్ని కోరుతున్నారు. వీరిలో చాలామంది కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉండటం వల్ల.. అధికార భారతీయ జనతాపార్టీ దీన్నీ ఓ ఆయుధంగా మలచుకుంటోంది. ప్రజాస్వామ్యంలో రాజులు, రాణులు, రాచరికానికి స్థానం లేదంటూ ప్రచారం చేస్తోంది.

రాచరికం పోయినా..
హిమాచల్‌ ప్రదేశ్‌ రాజకీయాల్లో రాజ కుటుంబాల ప్రభావం ఇంకా కొనసాగుతునే ఉంది. రాంపుర్‌ బుషహర్‌ రాజకుటుంబానికి చెందిన వీరభద్రసింగ్‌ ముఖ్యమంత్రిగా, ఎంపీగా.. దాదాపు 50 సంవత్సరాల పాటు హిమాచల్‌ ప్రదేశ్‌ రాజకీయాలను శాసించారు. ఇప్పుడు ఆయన కుమారుడు విక్రమాదిత్య శిమ్లా గ్రామీణ సీటు నుంచి బరిలో ఉన్నారు. వీరభద్రసింగ్‌ భార్య ప్రతిభాసింగ్‌ కోంతల్‌ రాజకుటుంబానికి చెందినవారు. మండి నుంచి ఎంపీగా ఎన్నికైన ఆమె భర్త వారసత్వాన్ని కొడుకు రూపంలో చూడాలనుకుంటున్నారు.

చంబా రాజకుటుంబానికి చెందిన ఆశాకుమారి కూడా ఎమ్మెల్యేగా ఎంపికవటానికి కష్టపడుతున్నారు. డల్హౌసి సీటు నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేస్తున్న ఆమె గెలిస్తే ఇది ఆరోసారి అవుతుంది. శిమ్లా జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ అనిరుధ్‌ సింగ్‌ కోటి రాజకుటుంబ సభ్యుడిగా కసుమ్తి నుంచి బరిలో ఉన్నారు. కులులో బంజర్‌ నియోజకర్గం నుంచి కులు రాజవంశస్థుడు హితేశ్వర్‌ సింగ్‌ స్వతంత్ర అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొడుకు రంగంలోకి దిగటం వల్ల కులు రాజుగా పేరొందిన ఆయన తండ్రి మహేశ్వర్‌సింగ్‌ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. గతంలో కంటే తక్కువ సంఖ్యలోనే రాజకుటుంబాలు ఎన్నికల బరిలో దిగినా.. వారి ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై మాత్రం ఎక్కువే!

భాజపా సామాన్య అస్త్రం
అనేక మంది రాజ కుటుంబీకులకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వగా.. వారందరిపైనా భాజపా వ్యూహాత్మకంగా సామాన్యులను పోటీకి దించింది. అంతేగాకుండా.. కాంగ్రెస్‌ను 'రాచరిక'పు పార్టీగా, రాజులు, రాణులకు చెందిన పార్టీగా ప్రచారం చేస్తోంది. రాచరికం పోయినా.. ఈ కుటుంబాలు రాష్ట్రంపై పెత్తనం చెలాయించటానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శిస్తోంది. ఇటీవల ప్రచారానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా "రాజులు, రాణుల కాలం కాదిది. సామాన్యులకు పట్టం కట్టే సమయమిది. ప్రజాస్వామ్యంలో రాచరికానికి స్థానం లేదు" అంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

దీన్ని రాజవంశీయులు తిప్పికొడుతున్నారు. "ప్రస్తుత తరానికి అభ్యర్థి రాజవంశీయుడా, సామాన్యుడా అనేదానితో సంబంధం లేదు. అభ్యర్థి ప్రవర్తనను చూసి ఓటు వేస్తారు. ప్రజలకోసం పనిచేస్తే, వారి అభివృద్ధికి పాటుపడితే ఓటు వేస్తారు. రాజవంశీయులైనా సామాన్యుల్లా ప్రవర్తిస్తే అక్కున చేర్చుకుంటారు" అని కోటి రాజవంశీయుడు అనిరుధ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. ప్రజలు మాత్రం రాజకుటుంబీలకు ఇచ్చే గౌరవాన్ని ఇంకా ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీరి ప్రభావం అధికంగానే ఉంది.

"హిమాచల్‌ ప్రదేశ్‌లో అనేక సంస్థానాలు, ప్రదేశాలకు వీరు రాజులనే సంగతిని ఎలా మారుస్తాం? సామాన్యులపై తప్పకుండా వారి ప్రభావం ఉంటుంది" అని ఉనాకు చెందిన దుకాణదారు ఒకరు అభిప్రాయపడ్డారు. ఈనెల 12న జరిగే ఎన్నికల్లో రాజకుటుంబాలకు గౌరవం పేరుతో భూస్వామ్యుల చెరలో పడొద్దని భాజపా ఓటర్లను హెచ్చరిస్తోంది.

ఎవరెటు?
బరిలో ఎవరో తెలిసిపోయిందిగాని.. ఎవరే పార్టీయో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రా నియోజకవర్గం ప్రజలు. ఇక్కడ.. ఆరుగురు పోటీలో ఉన్నారు. భాజపా పవన్‌కుమార్‌ కాజల్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. ఈయన 2017 ఎన్నికల్లో ఇక్కడి నుంచే కాంగ్రెస్‌ టికెట్‌పై నెగ్గారు. ఈసారి భాజపాలో చేరి టికెట్‌ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈయన ప్రత్యర్థిగా సురీందర్‌కుమార్‌ కాకును కాంగ్రెస్‌ దించింది. సురీందర్‌ ఇన్నాళ్లూ భాజపాలో ఉండి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఇన్నాళ్లూ ఒకపార్టీలో ఉండి.. ఎన్నికల వేళ మరో పార్టీలోకి మారటంతో కార్యకర్తలతో పాటు ఓటర్లూ అయోమయంలో పడుతున్నారు.

ఇవీ చదవండి :గుజరాత్ పీఠం భాజపాదే.. రెండో స్థానంలో ఆప్​.. ఆసక్తికరంగా ప్రీ-పోల్ సర్వే

'రూ.500 కోట్ల పార్టీ ఫండ్ కోసం కేజ్రీవాల్ ఒత్తిడి'.. మరో బాంబు పేల్చిన సుకేశ్

Last Updated : Nov 6, 2022, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details