ప్రశాంతంగా ముగిసిన హిమాచల్ ప్రదేశ్ పోలింగ్
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ అవాంఛనీయ ఘటనలు లేకుండా సాగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ సమయం ముగిసేనాటికి లైన్లో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. పోలింగ్ ముగిసిన చోట్ల ఈవీఎంలకు సీల్ వేశారు. 3 గంటల వరకు 55.65 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లాహౌల్-స్పితి జిల్లాలోని స్పితి ప్రాంతంలోని తాషిగ్యాంగ్‌లో 15,256 అడుగుల ఎత్తులో ఈసీ.. పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ 52 మంది ఓటర్లు ఉండగా 51 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్ ఓటరు తీర్పు నిక్షిప్తం... ఈవీఎంలకు సీల్! - హిమాచల్‌ప్రదేశ్ ఓటర్లు
17:27 November 12
15:54 November 12
3 గంటల వరకు 55.65 శాతం ఓటింగ్
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 55.65 శాతం ఓటింగ్ నమోదైంది.
15:20 November 12
ఒంటిగంట వరకు 37.19 శాతం పోలింగ్
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 37.19 పోలింగ్ నమోదైంది. సిర్ముర్ జిల్లాలో అత్యధికంగా 41.89 నమోదైంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సొంత జిల్లా మండీలో 41.17 పోలింగ్ రికార్డైంది.
12:57 November 12
పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటేసిన 105 ఏళ్ల వృద్ధురాలు
చురాహ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నరో దేవి అనే 105 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంబా జిల్లాలోని లధాన్ పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేశారు.
11:48 November 12
ఓటేసిన నడ్డా.. 11 గంటల వరకు 17 శాతం పోలింగ్
హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు 17 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
10:24 November 12
ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి
హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్.. ఆయన కుమారుడు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో సహా కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మాట్లాడిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.. ఉత్తరాఖండ్, యూపీ, మణిపుర్, గోవాలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విధంగానే ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు.
09:26 November 12
ఓటేసిన ముఖ్యమంత్రి ఠాకూర్.. కుటుంబ సభ్యులతో గుడికి వెళ్లి పూజలు
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తన కుటుంబ సభ్యులతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండీలోని పోలింగ్ స్టేషన్‌కు వచ్చిన ఆయన.. భాజపా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. మరోవైపు తొలి గంటలో కేవలం 4 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
06:50 November 12
ప్రారంభమైన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్.. ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని విజ్ఞప్తి
Himachal Pradesh Election 2022 : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని 68 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
- మొత్తం ఓటర్లు- 55,07,261
- పురుష ఓటర్లు- 27,80,208
- మహిళా ఓటర్లు- 22,27,016
- తొలిసారి ఓటువేయబోయే యువ ఓటర్లు- 1,86,681
- పోలింగ్ కేంద్రాలు- 7,881
- పోలింగ్ తేదీ- నవంబరు 12
- ఓట్ల లెక్కింపు తేదీ-డిసెంబరు 8
ఈ ఎన్నికలకు మొత్తం 7881 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 789 పోలింగ్ బూత్‌లు సమస్యాత్మకమైనవిగా, 397 పోలింగ్ బూత్‌లో అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 2017 ఎన్నికల్లో 75.57శాతం పోలింగ్ నమోదైంది. లాహౌల్-స్పితి జిల్లాలోని స్పితి ప్రాంతంలోని తాషిగ్యాంగ్‌లో 15,256 అడుగుల ఎత్తులో ఈసీ బూత్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ 52 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో పూర్తికానుంది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 35. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 43, కాంగ్రెస్ 22 స్థానాలు దక్కించుకున్నాయి. రాష్ట్రంలో రెండో సారి వరుసగా అధికారంలోకి రావాలని భాజపా తహతహలాడుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయం మేమే అంటూ ఆమ్ఆద్మీ పార్టీ అదృష్టం పరీక్షించుకుంటోంది.
ఈ ఎన్నికల్లో 412 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, మాజీ సీఎం వీరభద్రసింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్, భాజపా మాజీ చీఫ్ సత్పాల్ సింగ్ సట్టి తదితరులు ఉన్నారు. సీఎం జైరాంఠాకూర్ మండీలోని సెరాజ్ నుంచి బరిలో నిలుస్తుండగా.. భాజపా మాజీ చీఫ్ సట్టి ఉనా నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.