Himachal Pradesh Election 2022 : ఎత్తైన పర్వత ప్రాంతాలు, అతిశీతల వాతావరణానికి ఆలవాలమైన హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. ఇక్కడి ఓటర్ల తీర్పు ప్రతిసారీ విలక్షణంగా ఉంటోంది. విపక్షంలో ఉన్న ప్రధాన పార్టీకి అయిదేళ్ల తర్వాత అధికారాన్ని కట్టబెట్టడం గత మూడు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఎంత బలమైన రాజకీయ పక్షమైనప్పటికీ వరుసగా రెండో సారి అవకాశమివ్వకపోవడమనే ప్రత్యేకత రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. అధికార భాజపా.. విపక్ష కాంగ్రెస్‌ల మధ్య తాజా అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
అంతర్గత పోరు
రాష్ట్రంలో భాజపాకు ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ ధుమాల్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌లాంటి బలమైన నేతలున్నప్పటికీ కార్యకర్తలు, నాయకులు ఈ నేతల వర్గాలుగా విడిపోవడం తలనొప్పులు తెచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్న భాజపా నాయకత్వం వాటిని విశ్లేషిస్తోంది. 68 స్థానాలున్న రాష్ట్రంలో భాజపా 25 సీట్లలో చాలా బలంగా ఉన్నట్లు, 18 స్థానాల్లో గట్టి పోటీనిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాంగ్రెస్ 22 స్థానాల్లో బలంగా కనిపిస్తోంది. అంతర్గత వర్గ రాజకీయాలు ముదిరితే పార్టీలకు నష్టం తప్పదు. 90 వేల నుంచి లక్ష దాక ఓటర్లుండే అసెంబ్లీ సీట్లలో అసంతృప్తులు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసి ఓట్లు చీలిస్తే ఆమేరకు పార్టీల విజయావకాశాలు దెబ్బతింటాయి. కాంగ్రెస్‌లో వర్గ పోరు మూడో వంతు సీట్లకు పరిమితం కాగా, భాజపాలో అది సగం స్థానాల వరకు ఉన్నట్లు విశ్లేషకుల అంచనా. అయితే, కాంగ్రెస్‌లోనూ పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్, సీఎల్‌పీ నేత ముఖేశ్ అగ్నిహోత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు సుఖ్‌విందర్‌సింగ్ సుఖు, మాజీ మంత్రి సుధీర్‌శర్మలాంటి వారు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతుండటం ఆ పార్టీకి సమస్యాత్మకంగా మారింది. అయితే, ఆ పార్టీకి 40 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు కావడం కొంత సానుకూలమైన అంశం.