మొదట్లో.. సాధారణ జీవనమే. తండ్రి.. రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్. తానూ ఒకప్పుడు పాలు విక్రయించారు. ఇప్పుడు రాష్ట్రాన్నే పాలించనున్నారు. ఆయనే.. హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న సుఖ్విందర్ సింగ్ సుఖు. సీఎంగా ఆయన పేరును కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించింది. భాజపాకు చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ తర్వాత.. హమీర్‌పూర్ జిల్లా నుంచి ఆయన రెండో ముఖ్యమంత్రి కానున్నారు. మొత్తంగా చూస్తే.. రాష్ట్రానికి ఏడో సీఎం.
పాల విక్రేత నుంచి సీఎం వరకు.. హిమాచల్ నూతన ముఖ్యమంత్రి విజయ ప్రస్థానం - himachal pradesh election
సుఖ్విందర్ సింగ్ సుఖు.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజయ ప్రస్థానం గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఎస్‌ఎస్ సుఖు.. దిగువ హిమాచల్‌కు చెందిన కాంగ్రెస్ నేత. పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. 1980ల్లో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి రాజకీయాలనుంచి యూత్ కాంగ్రెస్ నాయకుడిగా.. ఇలా అంచెలంచెలుగా ఎదిగి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2003లో తొలిసారి మొదలు.. నాదౌన్ అసెంబ్లీ స్థానం నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు గెలుపొందారు. 58 ఏళ్ల సుఖుకు రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరుంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి.. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
వృత్తిరీత్యా న్యాయవాది అయిన సుఖు.. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. రెండుసార్లు శిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. వర్సిటీ రాజకీయాల్లో దూకుడు కారణంగా.. ఆయనకు ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు ఉంది. 2013 నుంచి 2019 మధ్య రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న సమయంలో.. పార్టీని బలోపేతం చేశారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందని రాజకీయ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు.