హిమాచల్‌ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్.. తనసొంత నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. మండీ జిల్లాలోని సిరాజ్ నియోజకవర్గంలో భాజపా నుంచి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి చేత్రామ్పై 22,200 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
హిమాచల్ సీఎం జైరాం ఠాకూర్ ఘన విజయం.. వరుసగా ఆరోసారి..
సిరాజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హిమాచల్‌ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్.. వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. 22,200 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందినట్లు ఈసీ వెల్లడించింది.
దాదాపు 75,000 మంది ఓటర్లు ఉన్న ఈ స్థానానికి ఆరుగురు అభ్యర్థులు పోటీ చేశారు. సీపీఐ(ఎం) నుంచి మహేందర్ సింగ్, ఆప్ నుంచి గీతానంద్, బీఎస్పీ నుంచి ఇంద్రాదేవి, స్వతంత్ర అభ్యర్థి నరేందర్ కుమార్‌లు బరిలోకి దిగారు. పోలైన ఓట్లలో 75 శాతానికి (47,490) పైగా ఓట్లు జైరాం ఠాకూర్ కైవసం చేసుకున్నారు. రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్ నేత చేత్రామ్కు 21.47 శాతం (13,440)ఓట్లు వచ్చాయి.
1993లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు జైరాం ఠాకూర్. అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. 26 ఏళ్ల వయసులోనే చచ్యోట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన.. ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 1998లో మరోసారి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2003, 2007, 2012, 2017 ఐదుసార్లు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత చచ్యోట్ స్థానం.. సిరాజ్గా మారింది. ఇప్పుడు 57 ఏళ్ల వయస్సులో ఏడోసారి ఇక్కడి నుంచి బరిలో దిగి జయకేతనం ఎగురవేశారు.