హిమాచల్ ప్రదేశ్ మఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని మంత్రివర్గం మొదటి కేబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వాగ్ధానాన్ని నిలబెట్టుకుంటూ.. పాత పెన్షన్ పథకం పునరుద్ధరనకు ఆమోదం తెలిపింది. ఈ కొత్త పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) కింద ఉద్యోగులు, పెన్షనర్లు సహా 1.36 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్‌ని పునరుద్ధరించింది ఓట్ల కోసం కాదని.. హిమాచల్ అభివృద్ధి చరిత్రను తిరగరాసిన ఉద్యోగులకు సామాజిక భద్రత, ఆత్మగౌరవం కల్పించడం కోసమేనని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉద్యోగులకు తమ ప్రభుత్వం అందించే సంక్రాతి కానుకని ఆయన అన్నారు. ఓపీఎస్ పునరుద్దరణ పట్ల ఉద్యోగులు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
శుక్రవారం నుంచే పాత పెన్షన్ స్కీమ్(ఓపీఎస్) అమల్లోకి వస్తుందని.. త్వరలోనే దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం సుఖు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తొలి కేబినెట్ సమావేశంలో ఓపీఎస్‌ని తిరిగి ప్రవేశ పెడతామని.. ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది. ప్రస్తుతం దానికి అనుగుణంగా నడుచుకుంటూ.. ఇచ్చిన మాట నెరవేర్చుకుందని ఆయన తెలిపారు. 2004 జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారు కొత్త పెన్షన్ పాలసీ పరిధిలోకి వస్తారని చెప్పారు.