Himachal Pradesh BJP Manifesto : సంక్షేమ పథకాలతో ప్రజల్ని సాధికారుల్ని చేయడానికి, ఉచిత హామీలతో ప్రలోభాలకు గురిచేయడానికి మధ్య సన్నటి గీత ఉందని వ్యాఖ్యానించారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అన్ని వర్గాల సాధికారత కోసమే పని చేస్తుందని స్పష్టం చేశారు. ఈసీ ప్రకటనతో సంబంధం లేకుండా.. 365 రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధంగా ఉంటుందని చెప్పారు నడ్డా. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా శిమ్లా వచ్చిన జేపీ నడ్డా.. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.
"సాధికారత, ప్రలోభపెట్టడానికి మధ్య తేడా ఉంది. అవసరం లేనిది కూడా ఇస్తే.. అది ప్రలోభం. కానీ.. ప్రజల జీవితాన్నే మార్చే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్లాంటిది ఏదైనా ఇస్తే.. అది సాధికారత. మేము సాధికారత దిశగానే ముందుకు సాగుతాం. మేము ప్రధానంగా మహిళా సాధికారతపై దృష్టిపెట్టాం. ఎందుకంటే.. మహిళల సాధికారత సాధిస్తే కుటుంబం మొత్తం లాభపడుతుంది. జనాభాలో సగం మహిళలే. అలానే.. వ్యవసాయం చేసేవారినీ మేము సాధికారుల్ని చేశాం" అని చెప్పారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా.
హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగుతుందన్న కాంగ్రెస్ అంచనాలపై తనదైన శైలిలో స్పందించారు నడ్డా. "మేము ఇప్పటికే సంప్రదాయాన్ని మార్చేశాం. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపుర్లో ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం మార్చేశాం." అని అన్నారు.