Tomato Farmer Crorepati : దేశవ్యాప్తంగా టమాటా ధరలు.. భగ్గుమంటున్నాయి. కిలో టమాటా ధరరూ.150 నుంచి రూ.300 వరకు పలుకుతోంది. దీంతో అనేక మంది ప్రజలు.. టమాటాలనుకొనుగోలు చేయలేక వాటిని వినియోగించడం ఆపేశారు. మరికొందరు కొనుగోలు చేసినా.. తక్కువగా వాడుతున్నారు. పెద్ద రెస్టారెంట్లు అయితే ఏకంగా టమాటాతో తయారు చేసిన వంటకాల విక్రయాలను నిలిపివేశాయి. ఇవన్నీ పక్కనపెడితే.. ఈ టమాటా ధరలు.. దేశంలో కొందరు రైతులను కోటీశ్వరులను చేస్తున్నాయి. మార్కెట్లో మంచి ధర పలుకుతుండడం వల్ల వారు భారీ లాభాలను ఆర్జిస్తున్నారు.
తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లా బాల్హ్ లోయకు చెందిన 67 ఏళ్ల జైరామ్ సైనీ సుమారు 37 ఎకరాల్లో సాగు చేసిన టమాటా పంట కాసుల వర్షం కురిపించింది. దాదాపు 8,300 బాక్సులు అమ్మడం ద్వారా రూ.1.10 కోట్లు తన ఖాతాలో వేసుకున్నారు. 50 ఏళ్లుగా టమాటా సాగు చేస్తున్నా.. ఈ ఏడాది మాత్రమే ఆయన పంట పండింది. గతేడాది ఇదే సమయంలో 10 వేల టమాటా బాక్సులు విక్రయించానని.. దీనికి గాను రూ. 55 లక్షలు మాత్రమే వచ్చినట్లు సైనీ తెలిపారు.
కుమారుల సహాయంతో..
Tomato Farmers News : వ్యవసాయంలో జైరామ్ సైనీకి తన ఇద్దరు కుమారులు సహాయం చేస్తుంటారు. పెద్ద కుమారుడు సతీశ్.. స్థానిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తూనే.. తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా ఉంటున్నారు. చిన్న కుమారుడు మనీశ్.. తండ్రితో ఎప్పుడూ వ్యవసాయంలో తోడుగా ఉంటారు. అయితే తాము పండించిన టమాటాను దిల్లీలోని ఆజాద్పుర్కు పంపామని.. అక్కడ చాలా లాభం వచ్చిందని సతీశ్ తెలిపారు.