హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఆస్తులు ఐదేళ్లలో రెట్టింపయ్యాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మండీ జిల్లాలోని సిరాజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న ఆయన.. ఈ మేరకు నామినేషన్ వేశారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం జైరాం ఠాకూర్ మొత్తం ఆస్తుల విలువ రూ.6.28 కోట్లు. 2017 ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు రూ.3.27కోట్లుగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో దాదాపు రూ.3కోట్ల ఆస్తి పెరిగినట్లు తెలుస్తోంది.
గడిచిన ఐదేళ్లకు తన ఆదాయం రూ.1.80 కోట్లు అని జైరాం ఠాకూర్ ప్రకటించారు. వీటిపై ఆదాయ పన్ను కట్టినట్లు తెలిపారు. సీఎం అఫిడవిట్లోని వివరాల ప్రకారం.. గడిచిన ఐదేళ్లలో ఆయన భార్య సంపాదన రూ.1.5 కోట్లు. దీనిపైనా ఆమె పన్ను చెల్లించారు. ఇకపోతే, ముఖ్యమంత్రికి మూడు బంగారపు ఉంగరాలు, ఓ గోల్డ్చైన్ ఉన్నాయి. వీటి విలువ రూ.3.1లక్షలు. సీఎం భార్యకు రూ.17లక్షలు విలువ చేసే 375 గ్రాముల బంగారం ఉంది. వీరికి ఇద్దరు సంతానం కాగా.. చెరో వంద గ్రాముల చొప్పున బంగారం ఉంది. ఈ బంగారం విలువ రూ.11.40 లక్షలు.