Hijab Issue: కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులో హిజాబ్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. నగరంలోని పి.దయానంద పాయ్, పి.సతీష్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీకి చెందిన విద్యార్థులు పరస్పరం గొడవకు దిగారు. తలకు గుడ్డ కట్టుకుని వచ్చేేందుకు ప్రిన్సిపల్స్ అనుమతించగా కొందరు అలానే పరీక్షలకు హాజరయ్యారు.
ఇప్పటికే హిజాబ్ ధరించి పాఠశాలలకు హాజరు కావద్దని స్పష్టమైన ఆదేశాలు ఉండగా.. వారు హిజాబ్ ధరించినప్పుడు పెట్టుకునే పిన్ను తలపై ఉంచుకొని హాజరయ్యారు. అది చూసిన ఓ వర్గం విద్యార్థులు.. వారిని బయటికి పంపాలని సిబ్బందిని కోరారు.
దీంతో కొంతమంది విద్యార్థులు పరీక్ష కేంద్రం బయట నిరసన చేపట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. అనంతరం కళాశాల ప్రవేశద్వారం వద్ద విద్యార్థులు ఘర్షణకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కళాశాలల ప్రిన్సిపాల్లు కూడా సమావేశం నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులు తలకు గుడ్డ కట్టుకుని పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించారు. అయితే.. విద్యార్థులు హిజాబ్‌ను పోలి ఉండే గుడ్డపై పిన్‌లను ఉపయోగించవద్దని చెప్పారు.