Hijab Issue: కర్ణాటకలో ఇటీవల చెలరేగిన హిజాబ్ వివాదాన్ని అస్త్రంగా మలుచుకుంటూ మన దేశంలో మతచిచ్చు రాజేసేందుకు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ 'అల్‌ఖైదా' అధినేత అయ్‌మాన్ అల్ జవాహిరీ తాజాగా ప్రయత్నించాడు. భారత ప్రజాస్వామ్యాన్ని లక్ష్యంగా చేసుకొని అనుచిత విమర్శలు గుప్పించాడు. కర్ణాటకలోని మాండ్యలో హిజాబ్ వివాదం చెలరేగినప్పుడు మతపరమైన నినాదాలు చేసిన కళాశాల విద్యార్థిని ముస్కాన్ ఖాన్‌ను ప్రశంసించాడు. ఈ మేరకు 8.43 నిమిషాల నిడివి గల ఓ వీడియోను అల్‌ఖైదా విడుదల చేసింది. అందులో కనిపించింది జవాహిరీయేనని 'సైట్' అనే అమెరికా నిఘాసంస్థ నిర్ధారించింది. హిందూ ప్రజాస్వామ్యమనే ఎండమావిని చూసి ముస్లింలు మోసపోకూడదని తాజా వీడియోలో జవాహిరీ పేర్కొన్నాడు. ముస్కాన్‌ను ప్రశంసిస్తూ తానే ఓ పద్యం రాశానని చెప్పాడు. దాన్ని చదివి వినిపించాడు. "హిందూ భారత్ వాస్తవికతను బయటపెట్టినందుకుగాను ముస్కాన్‌కు అల్లా శుభం కలుగజేయుగాక. భారత హిందూ ప్రజాస్వామ్యమనే ఎండమావిని చూసి మనం మోసపోవడం ఆగిపోవాలి. మనల్ని ఆవహించిన భ్రమలు తొలగిపోవాలి. హిందూ ప్రజాస్వామ్యం అనేది ముస్లింలను అణచివేసే సాధనం తప్ప మరేదీ కాదు" అని పేర్కొన్నాడు.
భారత్‌లో చిచ్చుకు అల్‌ఖైదా యత్నం.. 'హిజాబ్ యువతి'పై ప్రశంసలు
Hijab Issue: హిజాబ్ వివాదంపై మన దేశంలో మతచిచ్చు రాజేసేందుకు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ 'అల్‌ఖైదా' అధినేత అయ్‌మాన్ అల్ జవాహిరీ తాజాగా ప్రయత్నించాడు. హిందూ ప్రజాస్వామ్యమనే ఎండమావిని చూసి ముస్లింలు మోసపోకూడదని వీడియోలో జవాహిరీ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కర్ణాటకలో హిజాబ్ వివాదం చెలరేగినప్పుడు మతపరమైన నినాదాలు చేసిన కళాశాల విద్యార్థిని ముస్కాన్ ఖాన్‌ను ప్రశంసించాడు.
హిజాబ్
మాకేం తెలియదు: ముస్కాన్ తండ్రి
తాజా వ్యవహారంపై ముస్కాన్ తండ్రి హుస్సేన్ ఖాన్ స్పందిస్తూ.. "జవాహిరీ ఎవరో మాకు తెలియదు. అతణ్ని తొలిసారి ఈ వీడియోలోనే చూశా. అరబిక్ భాషలో అతడేదో అన్నాడు. మేమిక్కడ ప్రేమ, విశ్వాసంతో తోబుట్టువుల్లా నివసిస్తున్నాం. జవాహిరీ మా గురించి మాట్లాడాలని మేం కోరుకోలేదు. అతడితో మాకెలాంటి సంబంధాల్లేవు" అని పేర్కొన్నారు.
- హిజాబ్ వివాదం వెనుక అదృశ్య శక్తుల హస్తం ఉన్నట్లు జవాహిరీ వీడియోతో నిరూపితమైందని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. తాజా పరిణామాలపై పోలీసులు కన్నేసి ఉంచారని పేర్కొన్నారు.
Last Updated : Apr 7, 2022, 6:41 AM IST