Hijab controversy: కర్ణాటక హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. దీని కారణంగా ఇప్పటికే కర్ణాటకలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో హైకోర్టు ఈ అంశంపై కొద్ది రోజులుగా విచారణ జరుపుతోంది. ప్రస్తుతానికి రాష్ట్రంలోని విద్యాసంస్థలను తెరవాలని, తరగతిగదుల్లో విద్యార్థులు శాలువాలు, హిజాబ్‌లు, స్కార్ఫ్‌లు, మతపరమైన జెండాల వంటివి ధరించకుంటా చూడాలని కోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదపరి ఆదేశాలు వచ్చే వరకు వీటిని అమలు చేయాలని శుక్రవారం సూచించింది.
Hijab controversy mumbai
ముంబయికి పాకిన వివాదం..
హిజాబ్ వివాదం ముంబయికి కూడా పాకింది. నగరంలోని ఎంఎంపీ షా కళాశాల.. స్కార్ఫ్, బుర్ఖా, ముసుగు ధరించిన విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. కళాశాల నిబంధనల్లో ఈ అంశం స్పష్టంగా ఉందని తెలిపింది. ఈ కాలేజీ ఎస్ఎన్డీటీ ఉమెన్స్ యునివర్సిటీకి అనుబంధంగా ఉంది.
కాలేజ్ రూల్స్ బుక్‌లో ఉన్న నిబంధనలను తప్పుగా అర్థం చేసుకోవద్దని కాలేజీ ప్రిన్సిపల్ లీనా రాజే అన్నారు. విద్యార్థుల ముఖమే వారికి ఐడెంటిటీ అని, అందుకే కాలేజీలో విద్యార్థులు ముఖం కనపడకుండా వస్త్రాలు ధరించవద్దని చెబుతున్నట్లు పేర్కొన్నారు. కేవలం హిజాబ్ మాత్రమే కాక.. దుప్పట్టా, పరదా వంటి వస్త్రాలకు కూడా అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు.
ఈ విషయంపై సమాజ్‌వాద్ పార్టీ ఎమ్మెల్యే రయీస్ షేక్ స్పందించారు. మహారాష్ట్రలోని కళాశాలలో ఇలాంటి నిబంధన ఉంటే దాన్ని తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. కాలేజీ యాజమాన్యం నిబంధనలు మార్చుకోవాలని, సీఎం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామన్నారు.
Hijab controversy madhya pradesh
మధ్యప్రదేశ్‌లో రాజకీయ రంగు..
హిజాబ్ వివాదం మధ్యప్రదేశ్ రాజకీయాలను వేడెక్కిస్తోంది. హిజాబ్ అంశాన్ని రాద్దాంతం చేసి ఇంకా పెద్దది చేయొద్దని భోపాల్ నగర ఖాజి(మతపెద్ద) సయ్యద్ ముస్తాక్ అలీ నఖ్వీ సూచించారు. హిజాబ్ మార్గదర్శకాలపై సందిగ్ధతలు పొగొట్టేందుకు శుక్రవారం ప్రార్థనలకు ముందు మసీదుల్లో వివరిస్తామని పేర్కొన్నారు. కర్ణాటక పరిస్థితిని మధ్యప్రదేశ్‌లో రానీయొద్దని, ప్రజలంతా సంయమనంతో శాంతియుతంగా వ్యవహరించాలని కోరారు. ప్రతి మతం కొన్ని సంప్రదాయాలు, పద్ధతులను విశ్వసిస్తుందని, వాటిని పాటించడంలో తప్పు లేదని పేర్కొన్నారు. హిజాబ్, బుర్ఖాలపై ప్రత్యేకంగా వాదించాల్సిన అవసరం లేదన్నారు. మైనారిటీల సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకునే మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.
hijab row karnataka
ఆరుగురు అమ్మాయిల ఫిర్యాదు..
హిజాబ్ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఉడిపిలో నిరసన చేస్తున్న ఆరుగురు అమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ పిల్లల వ్యక్తిగత వివరాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారని ఆరోపించారు. వారి ఫోన్ నంబర్లు ఇతర విషయాలను వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు ఉడిపి జిల్లా సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యాసంస్థలు తెరుచుకోలే...
కర్ణాటక విద్యాసంస్థలు తెరవాలని హైకోర్టు సూచించినా చాలా సంస్థలు శుక్రవారం మూతపడే ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు మాత్రం తెరుచుకున్నాయి. హైస్కూల్స్‌ను సోమవారం తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. కాలేజీలు, యూనివర్సిటీలపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇదీ చదవండి:Hijab row: హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్