తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిజాబ్ వివాదం- రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం - హిజాబ్​పై ప్రభుత్వ కీలక నిర్ణయం

Hijab Controversy in Karnataka: ప్రభుత్వం నిర్దేశించిన యూనిఫామ్ డ్రస్​ కోడ్​ను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలు పాటించాలని కర్ణాటక సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వారి యాజమాన్యాలు నిర్ణయించిన డ్రెస్ కోడ్​ను తప్పనిసరి పాటించాలని తెలిపింది. హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను కళాశాలకు రాకుండా అడ్డగించిన ఘటనలు రాష్ట్రంలో వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.

Hijab Controversy in Karnataka
Hijab Controversy in Karnataka

By

Published : Feb 6, 2022, 4:55 AM IST

Updated : Feb 6, 2022, 8:00 AM IST

Hijab Controversy in Karnataka: కర్ణాటకలో పలు కళాశాలల్లో హిజాబ్‌ ధరించిన ముస్లిం విద్యార్థినులను అడ్డుకోవడం.. రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం నిర్దేశించిన యూనిఫామ్ డ్రస్​ కోడ్​ను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆయా పాఠశాలలు నిర్ణయించిన డ్రస్ కోడ్​ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. డ్రస్ కోడ్​ లేని కళాశాలల్లో సమానత్వం, సమగ్రత, శాంతి భద్రతలపై ప్రభావం చూపని దుస్తులు ధరించాలని స్పష్టం చేసింది.

రాజకీయ దుమారం!

Rahul Gandhi on Hijab:కళాశాలల్లో హిజాబ్‌ ధరించిన ముస్లిం విద్యార్ధినులను అడ్డుకోవడాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఖండించారు. విద్యార్థులకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపిన రాహుల్‌.. దేశంలో ఆడపిల్లల భవిష్యత్తును దోచుకుంటున్నారని మండిపడ్డారు. సరస్వతీ దేవి ఎవరి పట్ల వివక్ష చూపించరని, ఆమె అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తారని ట్విట్టర్ వేదికగా రాహుల్‌ వ్యాఖ్యానించారు.

'దేశ భవిష్యత్​కు రాహుల్​ ప్రమాదకారి'

అయితే రాహుల్‌ వ్యాఖ్యలను భాజపా తిప్పికొట్టింది. హిజాబ్‌కు మద్దతు ఇచ్చి రాహుల్‌గాంధీ దేశ భవిష్యత్తుకు ప్రమాదకారి అనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారని కర్ణాటక భాజపా ట్వీట్‌ చేసింది. విద్యను పొందడానికి హిజాబ్‌ అనేది అతిముఖ్యమైనది అయితే.. కాంగ్రెస్‌ పాలితరాష్ట్రాల్లో ముందుగా ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలని పేర్కొంది. పాఠశాలల్లో హిజాబ్‌ వంటి వాటిని ధరించేందుకు ఆస్కారం లేదని భాజపా కర్ణాటక అధ్యక్షుడు నలిన్‌ కుమార్‌ అన్నారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో తాలిబన్‌ల విధానాన్ని తాము అనుమతించబోమని ట్వీట్‌ చేశారు.

హిజాబ్ వివాదం

కర్ణాటకలో హిజాబ్ ధరించి కళాశాలకు వచ్చిన ముస్లిం విద్యార్థినులను గేటు వద్దే అడ్డుకున్న ఘటనలు ఇటీవల సంచలనం సృష్టించాయి. ఉడిపిలోని కుందాపూర్‌లోని ఓ కళాశాల విద్యార్థినులు హిజాబ్‌ ధరించి కాలేజీకి వచ్చారు. విద్యార్థినులు కళాశాల గేటు వద్దే అడ్డుకున్న సిబ్బంది.. ప్రభుత్వం జారీ చేసిన డ్రెస్‌కోడ్‌ ప్రకారం హిజాబ్‌లు ధరించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కళాశాల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎంతకీ లోపలికి అనుమతించకపోవడంతో అక్కడే ఆందోళనకు దిగారు.

హిజాబ్‌ ధరించిన విద్యార్ధినులు కళాశాలలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సందర్భంలో కొంతమంది హిందూ విద్యార్థులు కాషాయ శాలువాలు ధరించి ఆందోళనకు దిగారు. హిజాబ్‌కు అనుమతిస్తే కాషాయ శాలువాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పోలీసు సిబ్బంది బాలికల తల్లిదండ్రులను వెనక్కి పంపించారు.

ఇవీ చూడండి:

హిజాబ్ వివాదం- కాషాయ శాలువాలకు అనుమతివ్వాలని ఆందోళన

Rahul Gandhi on Hijab: 'దేశంలో ఆడపిల్లల భవిష్యత్తును దోచుకుంటున్నారు'

Last Updated : Feb 6, 2022, 8:00 AM IST

ABOUT THE AUTHOR

...view details