Hijab Ban Revoked In Karnataka :కర్ణాటక విద్యాసంస్థల్లో హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని తొలగించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. ఎవరైనా హిజాబ్ ధరించవచ్చని సీఎం స్పష్టం చేశారు. కర్ణాటక స్టేట్ పోలీస్, మైసూరు జిల్లా పోలీస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్మించిన మూడు పోలీస్ స్టేషన్లను సిద్ధ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో హిజాబ్‌పై ఒకరు ప్రశ్నించగా ఈ మేరకు సీఎం వివరణ ఇచ్చారు. వస్త్రధారణ అనేది వ్యక్తిగత ఛాయిస్ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. డిసెంబర్ 23 నుంచి ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పారు.
"హిజాబ్ నిషేధం ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించా. ఎవరైనా హిజాబ్ ధరించవచ్చు. నేను ధోతీ, జుబ్బా ధరిస్తున్నా. మీలో కొందరు ప్యాంటు, షర్టు ధరించారు. ఇందులో తప్పేం ఉంది? మీరు ఏదైనా తినొచ్చు. ఏదైనా ధరించవచ్చు. ఓట్ల కోసం ఇలాంటి రాజకీయాలు చేయడం తప్పు. వారు సబ్కా సాత్, సబ్కా వికాస్ అంటుంటారు. కానీ టోపీ, బుర్ఖా ధరించిన వారిని పక్కన పెడతారు. వారి ఉద్దేశం ఏంటి? మా ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుంది."
- సిద్ధరామయ్య, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి
కాగా, కార్యక్రమంలో మాట్లాడిన సిద్ధరామయ్య- ముఖ్యమంత్రినైన తనతో పాటు అధికారులందరికీ ప్రజలు చెల్లించే పన్నుల నుంచే వేతనం లభిస్తోందని తెలిపారు. ప్రతి అధికారి ఇది గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజా సేవే అందరికీ ప్రాధాన్యం కావాలని అన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే వారందరికీ గౌరవం ఇవ్వాలని, వారి సమస్యలను ఓపికతో వినాలని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లు పీపుల్ ఫ్రెండ్లీగా మారాలని అభిలషించారు.