తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Corona Death: గంటకు 165 మంది బలి! - రికార్డు స్థాయిలో కొవిడ్ మరణాలు

మే నెలలో దేశంలో కరోనా మహమ్మారి మృత్యు తాండవం చేసింది. గంటకు సగటున 165 మందిని పొట్టన పెట్టుకుంది. ప్రపంచంలోని ఏ దేశంలో లేని విధంగా వేల మందిని బలి తీసుకుంది. ఒక్క మే నెలలోనే 90 లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు నమోదవ్వగా లక్షా 20 వేల మందికిపైగా కన్నుమూశారు.

corona
కొవిడ్, కరోనా

By

Published : Jun 2, 2021, 2:14 PM IST

కరోనా మహమ్మారి కర్కశత్వానికి ఈ ఏడాది మే నెలలో భారత్​లో రోజుకు వేల సంఖ్యలో రోగులు కన్నుమూశారు. ప్రపంచంలోని ఏ దేశంలో నమోదవ్వని విధంగా భారత్‌లో రికార్డు స్థాయిలో కొవిడ్‌ కేసులు, మరణాలు నమోదయ్యాయి. మే నెలలో దేశంలో రికార్డు స్థాయిలో 90 లక్షల 30 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఒక నెలలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవ్వలేదు. ఏప్రిల్‌ నెలలో దేశంలో 69.4 లక్షల మంది కరోనా బారినపడగా దానికంటే 30 శాతం అధికంగా మేలో కేసులు వెలుగుచూశాయి.

  • మే 15 తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ్యలో క్రమంగా తగ్గుదల నమోదవుతున్నా.. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసులతో పోల్చితే భారత్‌లో కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది.
  • అమెరికాలో 2020 డిసెంబర్‌ చెత్త నెలగా నిలిచింది. ఆ నెలలో అగ్రరాజ్యంలో 65.3 లక్షల కేసులు నమోదయ్యాయి. కానీ అమెరికాలో ప్రతి పది లక్షల మందిలో దాదాపు లక్ష మంది కరోనా బారినపడగా.. భారత్‌లో అది కేవలం 20 వేలుగానే ఉంది.

పతాక స్థాయికి మరణాలు..

మే నెలలో కరోనా మరణాలు రికార్డు స్థాయికి చేరాయి. గత ఏడాది కరోనా విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి నమోదైన మొత్తం మరణాల్లో 33 శాతం ఈ ఏడాది ఒక్క మే నెలలోనే నమోదుకావడం గమనార్హం.

  • మేలో సుమారుగా లక్షా 20 వేల మందిని మహమ్మారి బలి తీసుకుంది. ప్రపంచంలో కరోనా కారణంగా ఒక నెలలో అత్యధికంగా సంభవించిన మరణాలు ఇవేనని గణాంకాలు వెల్లడించాయి.
  • అమెరికాలో జనవరి 2021 అత్యధిక కరోనా మరణాలు సంభవించిన నెలగా నిలిచింది. ఆ నెలలో అగ్రరాజ్యంలో 99 వేల 680 మందిని మహమ్మారి బలి తీసుకుంది. దీనిని భారత్‌ అధిగమించింది.
  • మే నెలలో గంటకు 165 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. సగటున రోజుకు 3,400 మరణాలు సంభవించగా.. 13 రోజుల పాటు రోజుకు 4 వేల కంటే ఎక్కువ మంది మరణించారు.
  • మే 19వ తేదీన ఒకరోజు వ్యవధిలో 4,529 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ప్రపంచంలో ఒకే రోజు నమోదైన అత్యధిక కరోనా మరణాల సంఖ్య ఇదేనని గణాంకాలు వెల్లడించాయి.
  • ఇదే ఏడాది ఏప్రిల్‌ కంటే 2.5 శాతం అధికంగా.. మేలో కరోనా మరణాలు సంభవించాయి.

రాష్ట్రాల్లో ఇలా..

కొన్ని రాష్ట్రాల్లో కరోనా మరణాలు మే నెలలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. దిల్లీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో జాతీయ సగటు 1.3 శాతం కంటే ఎక్కువగా.. కరోనా మరణాలు నమోదయ్యాయి.

  • దిల్లీలో 2.9, పంజాబ్‌లో 2.8, ఉత్తరాఖండ్‌లో 2.7 శాతం కరోనా మరణాలు సంభవించాయి.
  • ఈ ఏడాది మే నెలలో దిల్లీలో 8 వేల మంది మరణించగా 2 లక్షల 80 వేల కేసులు నమోదయ్యాయి.
  • ఈ సంవత్సరం కుంభ మేళాకు వేదికైన ఉత్తరాఖండ్‌లో సంభవించిన మొత్తం కరోనా మరణాల్లో ఒక్క మే నెలలోనే 59 శాతం నమోదుకావడం గమనార్హం.

అధికారిక గణాంకాల కంటే కరోనా మరణాల సంఖ్య ఇంకా భారీగా ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంత్యక్రియలు నిర్వహించే చోట మృతదేహాలు అధికంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:Corona Vaccine: విదేశీ టీకాల రాకకు లైన్‌క్లియర్‌..!

ABOUT THE AUTHOR

...view details