కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సమీక్ష నిర్వహించారు. నిబంధనలు పాటించకపోతే కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి 30 రోజుల్లో 406 మందికి వ్యాధి వ్యాపిస్తుందని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చూడాలని ఆయన పేర్కొన్నారు.
ఐదు సూత్రాలు..
కరోనా నిబంధనలు పక్కాగా పాటించడం, టెస్టింగ్ సెంటర్లు సహా టీకా పంపిణీ కేంద్రాల పెంపు, కొవిడ్ బారిన పడిన వారిని సకాలంలో గుర్తించడం, మహమ్మారి సోకిన వారంతా ఐసోలేషన్లో ఉండేలా చూడటం వంటివి కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు వ్యూహాలుగా ఉపయోగపడతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 46 జిల్లాల్లో కనీసం 14 రోజులపాటు సమర్థవంతమైన నియంత్రణ, కాంటాక్ట్ ట్రేసింగ్‌తో కరోనాను కట్టడి చేయాలని కోరింది. అలాగే ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచాలని నిర్దేశించింది.
మహారాష్ట్రలోని 36 జిల్లాల్లో 25 తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత వారం రోజుల్లో దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 59.8శాతం ఈ జిల్లాల నుంచే ఉన్నాయని తెలిపింది.