దిల్లీలో జనవరి 26 నాటి ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మక ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని రైతు సంఘాలు శనివారం డిమాండ్ చేశాయి. అన్నదాతలపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించాయి. ఈ మేరకు సింఘు సరిహద్దులో విలేకరులతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) సభ్యులు మాట్లాడారు. నోటీసులు అందుకున్న రైతులు నేరుగా.. పోలీసుల వద్దకు వెళ్లకుండా, న్యాయ సలహా కోసం యూనియన్ సంఘాలు ఏర్పాటు చేసిన లీగల్ సెల్ వద్దకు రావాలని తెలిపారు.
సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తితో.. జనవరి 26 హింసాత్మక ఘటనలపై విచారణ జరిపించాలని ఎస్కేఎం సభ్యుడు కుల్దీప్ సింగ్ డిమాండ్ చేశారు. నాటి ఘటనలో 122 మంది రైతులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారని మరో నేత రవీందర్ సింగ్ తెలిపారు. అరెస్టు చేసిన రైతులకు ఆర్థిక, న్యాయ సహాయాన్ని ఎస్కేఎం అందిస్తుందని పేర్కొన్నారు.