High Electricity Bill : కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ఇంటికి రూ.7 లక్షల దాటి కరెంట్ బిల్లు రావడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఉల్లాల్‌కు చెందిన సదాశివ ఆచార్య.. అనే వ్యక్తి ఇంటికి సగటున నెలవారి కరెంట్ బిల్లు రూ. 3,000 వరకు వచ్చేది. కానీ జూన్ నెలలో ఏకంగా రూ. 7,71,072 బిల్లు వచ్చింది. దీంతో ఒక్కసారిగా అతడు షాక్‌కు గురయ్యాడు. ఏం చేయాలో అర్థంకాక వెంటనే సంబంధిత అధికారులను ఆశ్రయించాడు. సదాశివ ఫిర్యాదుకు స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు.. తప్పుగా ప్రింట్ అయిన బిల్లును సరిచేసి.. రూ. 2,838 బిల్లును అతడి ఇంటికి పంపారు.
"మాకు జూన్ నెలలో రూ. 7,71,072 కరెంట్ బిల్లు వచ్చింది. బిల్లులో 99,338 యూనిట్ల విద్యుత్ వాడినట్లు ఉంది. సాధారణంగా మాకు నెలకు రూ. 3,000 వరకు విద్యుత్ బిల్లు వచ్చేది. కరెంట్ బిల్లును క్రమం తప్పకుండా చెల్లిస్తాం. కానీ జూన్ నెలలో ఏకంగా రూ.7 లక్షల పైన బిల్లు రావడం చూసి నాతో పాటు, మా ఇంట్లో వారంతా షాక్‌కు గురయ్యాం"
- సదాశివ ఆచార్య, ఇంటి యజమాని.
ఇటీవల కర్ణాటక ప్రభుత్వం జులై 1 నుంచిగృహ జ్యోతి పథకం (ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం) అమలు చేస్తామని తెలిపింది. జులై వరకు బకాయిపడ్డ కరెంట్ బిల్లులు ప్రజలు చెల్లించాల్సిందేనని తెలిపింది. అయితే ఇప్పుడు ఓ ఇంటికి ఏడు లక్షల రూపాయలు దాటి కరెంట్ బిల్లు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
"ప్రతినెలా విద్యుత్ బిల్లులు ఏజెన్సీల ద్వారా వసూలు చేస్తాం. అయితే ఇక్కడ.. రీడర్ మెషీన్లో చిన్న పొరపాటు జరగడం వల్ల బిల్లు తప్పుగా ప్రింట్ అయ్యింది. ఇలా ఎప్పుడైన బిల్లు తప్పుగా వస్తే.. దాన్ని వినియోగదారుడికి ఇవ్వం. పొరపాటుగా ప్రింట్ అయిన బిల్లును సరిచేసి ఆచార్య ఇంటికి పంపుతాము"
- దయానంద, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఉల్లాల సబ్ డివిజన్.
గతంలో కూడా సాధారణం కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు..వారిది అపార్ట్మెంట్లోని ఓ ప్లాట్.. విద్యుత్ బిల్లు ప్రతి నెలా రూ. 200లోపే వస్తుంటుంది. కానీ ఈ నెలలో మాత్రం వచ్చిన బిల్లు చూస్తే వారికి నిజంగానే కరెంట్ షాక్ తగిలింది. ఈ నెలలో కరెంటు బిల్లు అక్షరాలా రూ.3కోట్ల 20 లక్షల 5వేల,218 వచ్చింది. సర్వీసు నెంబర్‌కు ఉన్నన్ని సంఖ్యల్లా ఉన్న బిల్లు మొత్తాన్ని చూసి ఇంటి యజమాని షాకయ్యాడు.మహబూబాబాద్ పట్టణంలో కృష్ణవేణి స్కూల్ సమీపంలోని బొల్లం నాగేశ్వరరావు అపార్ట్మెంట్లో ప్లాట్ నెంబర్ 302కు భారీ మొత్తంలో విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ కథనాన్ని పూర్తిగా చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.