ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు... లోకేశ్ సీఐడీ విచారణ 10న - lokesh comments on cid
Published : Oct 3, 2023, 3:02 PM IST
|Updated : Oct 3, 2023, 8:04 PM IST
14:55 October 03
లోకేశ్ ఇచ్చిన లంచ్ మోషన్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ
Nara Lokesh Lunch Motion Petition: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సీఐడీ విచారణను అక్టోబరు 10కి వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో లోకేశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులో నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేశ్ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లోకేశ్ తరఫున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. హెరిటేజ్ సంస్థలో లోకేశ్ షేర్ హోల్డర్ అని, ఆయనకు తీర్మానాలు ఇవ్వాలన్నా, బ్యాంకు ఖాతా పుస్తకాలు ఇవ్వాలన్నా కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని కోర్టుకు వివరించారు. లోకేశ్‌ను ఇవి అడగడం సమంజసం కాదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని, బుధవారమే విచారణకు హాజరు కావాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు. దీనిపై స్పందించిన పోసాని అంత తొందరేముందని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం అక్టోబరు 10న సీఐడీ విచారణకు లోకేశ్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో బుధవారం విచారణకు రావాలని లోకేశ్‌కు సీఐడీ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఫైబర్ నెట్ కేసు:ఫైబర్ నెట్ కేసులో లోకేశ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. లోకేశ్ ను అరెస్టు చేస్తారనే ఆందోళన తమకు ఉందని లోకేశ్ తరఫు లాయర్లు తెలిపారు. ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా చేర్చలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒకవేళ చేరిస్తే లోకేష్‌కు సీఆర్పీసీ 41 A నోటీసులు ఇస్తామని వివరించారు. దీనిపై స్పందించిన లోకేశ్ తరఫు న్యాయవాది 41 A నిబంధనలు పాటించకపోతే కోర్టుకు విన్నవిస్తామన్నారు.