'ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టారు, ఆధారాలు మాయం చేశారు' - సీఎం జగన్, సజ్జల సహా 41మందికి నోటీసులు
Published : Nov 23, 2023, 12:06 PM IST
|Updated : Nov 23, 2023, 6:56 PM IST
12:02 November 23
సీఎం జగన్, మంత్రులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశం
Raghurama's petition alleges financial irregularities in Andhra Pradesh: ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్ (పిల్)పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆర్థిక అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎంపీ రఘురామ పిటిషన్ వేయగా.. హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ.. విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. విచారణకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, అధికారులు సహా మొత్తం 41 మందికి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
పిటిషన్ వేయగానే రికార్డుల ధ్వంసం ...కాగా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకుండానే పర్సనల్ ఇంటెన్షన్ తో పిటిషన్ వేశారని ప్రభుత్వం తరుఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అసలు ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని పేర్కొన్నారు. పిటిషన్ వేసిన తర్వాత కూడా ప్రభుత్వ అవినీతి అంటూ మీడియాలో రఘురామకృష్ణరాజు మాట్లాడారని అభ్యంతరం చెప్పారు. పిటిషనర్ రఘురామ తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ మాట్లాడుతూ.. పిటిషన్ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సహా 41మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది.
అనుయాయులకు మేలు చేకూర్చేలా...పిటిషనర్ రఘురామరాజు తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ హైకోర్టు లో వ్యాజ్యం వేసిన తర్వాత కొన్ని ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించారని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. సీఎం తన అనుయాయులకు లబ్ది చేకూరేలా వ్యవహరించారని అన్నారు. ఇసుక, మద్యం, ఆరోగ్యశాఖకు కొనుగోలు చేసిన కొన్ని పరికరాలు, సిమెంట్ కొనుగోలు వ్యవహారం లో సీఎం జగన్.. బంధువులు, అనుయాయులకు లబ్ది చేకూర్చారని తెలిపారు. వీటి పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని ప్రభుత్వం తరపు ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. కేసును కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్ విచారణ అర్హత తేల్చే ముందు నోటీసులు ఇస్తామని తెలిపింది. సీఎం తో పాటు 41 మందికి నోటీసులు జారీ చేసింది. ప్రతివాదుల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు. తదుపరి విచారణను డిసెంబర్ 14 కు వాయిదా వేసింది.