High Court on Chandrababu Bail Petitions: అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు (Amaravati Inner Ring Road Case), అంగళ్లు (Angallu Incident), ఫైబర్‌నెట్ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు దాఖలు వేర్వేరుగా పిటిషన్లపై ఇటీవల తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు.. తన నిర్ణయాన్ని వెల్లడించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం.. రాజమండ్రి జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్నర్ రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో డీమ్డ్ కస్టడీలో (Deemed Custody) ఉన్నట్లు భావించి రెగ్యులర్ బెయిలు మంజూరు చేయాలని.. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఆ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసుకు (Skill Development Case), ప్రస్తుతం బెయిలు కోసం వేసిన రింగురోడ్డు, అంగళ్లు కేసులకు తేడా ఉందన్నారు. ఒక కేసులో అరెస్టు చేస్తే ఇతర కేసుల్లో అరెస్టైనట్లు.. సంబంధిత మెజిస్ట్రేట్ నుంచి ఉత్తర్వులు పొందాలని 'అనుపమ్ జే కులకర్ణి' కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. పిటిషనర్ స్కిల్ కేసులో మాత్రమే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని వెల్లడించారు. మిగత రెండు కేసులో అరెస్టు కాలేదు, కస్టడీలో లేరని న్యాయస్థానం పేర్కొంది.
కేసులు నమోదు చేసిన వెంటనే అరెస్ట్ చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని.. చంద్రబాబు తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా వాదించారు. స్కిల్ కేసులో అరెస్టు, రిమాండ్ తర్వాత పాత కేసుల్ని తెరపైకి తెచ్చి.. మరిన్ని రోజులు జైల్లో ఉంచాలని చూస్తున్నారని తెలిపారు. అయితే.. ముందస్తు బెయిల్ పొందేందుకు ఉన్న హక్కును పిటిషనర్ వినియోగించుకోకుండా ఇన్నాళ్లు మౌనంగా ఉండి.. పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యంచేశారనేనిందవేయడానికి వీల్లేదని హైకోర్టు తెలిపింది. బెయిలు పిటిషన్‌ను సరెండర్ పిటిషన్‌గా పరిగణించి.. బెయిలు మంజూరు చేయాలన్న అభ్యర్థనను అంగీకరించలేమని పేర్కొంది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ముందుగా సరెండర్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని.. ప్రస్తుత కేసులో అలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని కోర్టు అభిప్రాయపడింది. వ్యాజ్యంలో సైతం అలాంటి అభ్యర్థన చేయలేదని.. ఈ క్రమంలో బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సరెండర్ పిటిషన్‌గా భావించలేమని హైకోర్టు వెల్లడించింది. పిటిషనర్ డీమ్డ్ కస్టడీ పరిధిలోకి రారనే నిర్ణయానికి రావడంతో.. ఇరువైపు న్యాయవాదులు వినిపించిన ఇతర వాదనల్లోకి వెళ్లడంలేదని న్యాయస్థానం తెలిపింది. బెయిలు పిటిషన్లను కొట్టేస్తూ తీర్పు వెల్లడించింది.