అధికారులను ఉన్నపళంగా తమ ముందు హాజరుకావాలని కొన్ని హైకోర్టులు పిలవడం సరికాదని సుప్రీంకోర్టు వారించింది. ఈ పద్ధతి మానుకోవాలని సూచించింది. అధికారులను పిలిస్తే కోర్టు గౌరవం పెరగదని వ్యాఖ్యానించింది. ఉత్తరాఖండ్‌కు సంబంధించిన ఓ కేసులో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
'అధికారులను పిలిపించుకోవడం ద్వారా, కోర్టు అభిరుచులకు తగినట్టు ఆదేశాలు జారీ చేయాలని వారిపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా కార్యనిర్వాహక, శాసనవ్యవస్థల అధికారాల పరిధిని విభజించే రేఖను మీరినట్టవుతుంది. అధికారులను అప్పటికప్పుడు రమ్మనడం వల్ల వారు ఇతర కార్యక్రమాలను విడిచిపెట్టాల్సి వస్తుంది. ఇలాంటి ఆదేశాల వల్ల కొన్నిసార్లు వారు సుదూర ప్రయాణం చేయాల్సి రావచ్చు. అధికారులను అనవసరంగా కోర్టుకు పిలవకూడదని పునరుద్ఘాటిస్తున్నాం. వారిని తరచూ పిలవడం ప్రశంసనీయం కాదు. ఇది బలమైన పదాలతో ఖండించాల్సిన విషయం' అని జస్టిస్ గుప్తా తన తీర్పులో వ్యాఖ్యానించారు.