తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TSPSC Leak Case: మన పిల్లలు పరీక్షలు రాస్తే ఆ బాధ తెలుస్తుంది: హైకోర్టు - TSPSC paper Leakage Case latest news

TSPSC Leak Case
TSPSC Leak Case

By

Published : Apr 24, 2023, 12:36 PM IST

Updated : Apr 25, 2023, 10:34 AM IST

12:29 April 24

TSPSC Leak Case: మన పిల్లలు పరీక్షలు రాస్తే ఆ బాధ తెలుస్తుంది: హైకోర్టు

High Court on TSPSC Leak Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి సోమవారం మరోమారు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ఏఐసీసీ లీగల్ సెల్ ఇంఛార్జి వివేక్ ఠంకా వాదనలు వినిపించగా.. టీఎస్‌పీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ బి.ఎస్‌.ప్రసాద్ వాదించారు. ఈ సందర్భంగా లీకేజీపై సిట్‌ గతంలో ఇచ్చిన నివేదికతో పాటు సోమవారం సమర్పించిన అనుబంధ నివేదికను పరిశీలించిన అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది.

దర్యాప్తును సీబీఐకి అప్పగించాలా.. ప్రత్యేక దర్యాప్తు బృందంలోని సభ్యులను మార్చాలా అన్న అంశంపై తగిన ఆదేశాలు ఇస్తామని తెలిపింది. ప్రస్తుతం దర్యాప్తులో జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు.. సిట్‌లోని సభ్యుల నైపుణ్యం గురించి అవసరమైతే సైబరాబాద్‌, హైదరాబాద్‌, రాచకొండ కమిషనర్లలో ఒకరి నుంచి నివేదిక తెప్పించే అంశాన్ని పరిశీలిస్తామంది. ఇరు పక్షాల అంగీకారంతోనే ఇది జరుగుతుందని తెలిపింది. విచారణ సందర్భంగా సిట్‌ సభ్యుల గురించి ఆరా తీసిన జస్టిస్‌ విజయసేన్‌ రెడ్డి.. పోలీసుల పని తీరును శంకించలేమని, అయితే సాంకేతిక అంశాల్లో వారికి ఎంత నైపుణ్యం ఉందో పరిశీలించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల నుంచి వాంగ్మూలాలు ఎందుకు నమోదు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. రాజకీయాల్లో భాగంగా వారు ఎన్నో మాట్లాడుతుంటారని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే వారి నుంచి ఏదైనా సమాచారం రాబట్టారా అని జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి ఏజీని ప్రశ్నించారు. నెలన్నర అయినా అసలు నిందితులను గుర్తించలేదా అని అడిగారు. ఘటనకు బాధ్యులను గుర్తించడానికి ఇంత సమయం ఎందుకని.. కేసుపై విచారించడానికి శాఖలో అంతర్గత యంత్రాంగం లేదా అని ఏజీని ప్రశ్నించారు.

మన పిల్లలు పరీక్షలు రాస్తే ఆ బాధ తెలుస్తుంది..: ఈ సందర్భంగా పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో మన కుటుంబీకులు, పిల్లలు ఉంటే ఆ బాధ అర్థం అవుతుందని న్యాయమూర్తి జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి పేర్కొన్నారు. లీకేజీ వ్యవహారం, పరీక్షల వాయిదా కారణంగా అభ్యర్థులకు ఎంత ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకోవాలని సూచించారు. ఎగ్జామ్స్‌ రాసిన తర్వాత అవి రద్దయితే.. తిరిగి రాయడం ఎంతో కష్టంగా ఉంటుందని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే క్వశ్చన్‌ పేపర్లు లీకైన పరీక్షలను రద్దు చేయడం సబబేనని.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

మంత్రి కేటీఆర్‌కు ఎలా తెలుసు..: విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో జరుగుతున్నట్లుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కమిషన్‌లోని ఇద్దరు ఉద్యోగులు మాత్రమే దీనికి బాధ్యులని, ఎంతమంది అభ్యర్థులు పరీక్షలు రాశారు, ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు వచ్చాయన్న వివరాలన్నీ మంత్రి వెల్లడించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ ఆయనకు ఎలా తెలిశాయని అడిగారు. కేసులో ఇద్దరు చిన్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని.. కీలక వ్యక్తులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేవలం నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు కొనసాగుతోందన్న ఆయన.. దీనిని కేవలం అంతర్రాష్ట్ర కేసుగానే కాకుండా అంతర్జాతీయమైనదిగా కూడా చూడాలని కోర్టుకు విన్నవించారు.

సిట్‌లో నిపుణులున్నారు..: ప్రత్యేక దర్యాప్తు బృందంలో నిపుణులైన పోలీసులున్నారని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. సిట్‌కు ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తుండగా.. బృందంలో సైబర్‌ కేసులను దర్యాప్తు చేసే నిపుణులున్నారని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా సమాచారం ఎక్కడున్నా తీసుకునే హక్కు పోలీసులకు ఉందని.. పార్టీలకు చెందిన వారికి నోటీసులు ఇవ్వడం సబబేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్‌లోని మొత్తం 12 కంప్యూటర్లను సీజ్‌ చేశామని.. వాటిని సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు తరలించామని వివరించారు. నివేదిక అందాల్సి ఉందన్నారు. సిట్‌ దర్యాప్తు పారదర్శకంగానే జరుగుతోందని.. కేసులో నిందితులు ఎవరూ తప్పించుకోలేరని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి సిట్‌ సమర్పించిన దర్యాప్తు నివేదికలను పరిశీలించిన అనంతరం మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. ఈ మేరకు విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.

ఇవీ చూడండి..

TSPSC Paper Leak Case: హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన టీఎస్‌పీఎస్సీ

TSPSC Paper Leak : ఈడీ విచారణలో ప్రవీణ్ మౌనం.. నేనేం సంపాదించలేదన్న రాజశేఖర్

Last Updated : Apr 25, 2023, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details