High Court on Dharmapuri Election Dispute: ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై హైకోర్టు విచారణ చేపట్టింది. స్ట్రాంగ్ రూమ్ సీల్ పగులగొట్టి తెరిచేందుకు జగిత్యాల కలెక్టర్‌కు న్యాయస్థానం అనుమతిచ్చింది. అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరవాలని ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి కోరితే వాహనం, భద్రత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే వడ్రంగి, లాక్ స్మిత్ సహకారం తీసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఆర్‌వోకు డాక్యుమెంట్లు, సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ఇటీవల ధర్మాసనం ఆదేశించింది. తాళంచెవి సరిపోక స్ట్రాంగ్ రూమ్ తెరవలేకపోయినట్టు కలెక్టర్ హైకోర్టుకు తెలిపారు. తాళాల గల్లంతుపై విచారణ జరిపిస్తున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ క్రమంలోనే తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.
అసలేం జరిగిదంటే:జగిత్యాల జిల్లాలో 2018 సాధారణ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం స్ట్రాంగ్ రూం తాళాలను తెరిచేందుకు కలెక్టర్‌ను ఆదేశించింది. అయితే ఈ క్రమంలోనే ఈనెల 10న జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లగా తాళం చెవులు కనిపించలేదు. దీనిపై మరోసారి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ జరపాలని హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈసీ విచారణకు గతంలో ఎన్నిక్లలో పాల్గొన్న అధికారులు హాజరయ్యారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ముగ్గురు అధికారులు హాజరుకాగా.. ఆ రోజు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏం జరిగింది..? తాళం చెవులు ఎలా మాయమైపోయాయి..? దీనికి బాధ్యులు ఎవరనే కోణంలో విచారణ సాగింది. దీనికి జగిత్యాల, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ కలెక్టర్లు షేక్ యాస్మిన్ బాషా, డాక్టర్ శరత్, గుగులోతు రవిలు హాజరయ్యారు. వీరితో పాటు కుమురం భీం జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం.. మరో 40 మంది సిబ్బందిని అధికారులు విచారించారు. అనంతరం సేకరించిన సమాచారాన్ని కోర్టుకు నివేదించనున్నారు.