కర్తార్‌పుర్ సాహిబ్ గురుద్వారా నిర్వహణ బాధ్యతను సిక్కుయేతర సంస్థకు బదిలీ చేస్తూ పాకిస్థాన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది భారత్. ఈ చర్య ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. సిక్కుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తంచేసింది.
కర్తార్‌పుర్ సాహిబ్ వ్యవహారాలను నిర్వహించే హక్కును సిక్కు మైనారిటీలకు దూరం చేసే ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించింది భారత విదేశాంగ శాఖ.
" పాకిస్థాన్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం పూర్తిగా ఖండించదగినది. సిక్కుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉంది. సిక్కు మైనారిటీ హక్కులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మాకు వినతులు అందాయి. అలాంటి చర్యలు పాకిస్థాన్ ప్రభుత్వ నిజ స్వరూపాన్నిసూచిస్తున్నాయి."