Actress Dimple Hayathi Controversy Update : హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును ఢీకొట్టిన కేసులో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో తనపై కేసు నమోదు కావడంపై తాజాగా హీరోయిన్ డింపుల్ హయాతి స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ఎంతగానో అండగా నిలుస్తున్న అభిమానులకు డింపుల్ కృతజ్ఞతలు చెప్పారు. అయితే ఈ విషయం గురించి తాను ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదన్న ఆమె.. అభిమానులు దయచేసి సహనంతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. తన లీగల్ టీమ్ త్వరలోనే దీనికి బదులివ్వనుందని ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు.
'ప్రస్తుతం జరుగుతోన్న వ్యవహారంలో అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమకు నేను కృతజ్ఞురాలిని. ఇలాంటి పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. అయితే ఈ విషయం గురించి నేను ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అభిమానులు దయచేసి సహనంతో ఉండాలని కోరుకుంటున్నా. నా లీగల్ టీమ్ త్వరలోనే దీనికి బదులివ్వనుంది.' - ట్విటర్‌లో హీరోయిన్ డింపుల్ హయాతి
డింపుల్‌ను డీసీపీ వేధించాలనుకున్నారు..: తాజాగా పోలీసులు డింపుల్ హయాతికి 41 సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చారు. దీనిపై డింపుల్ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ స్పందించారు. హయాతిపై తప్పుడు కేసు పెట్టారన్నారు. డింపుల్‌తో డీసీపీ రాహుల్ హెగ్డే చాలా సార్లు అమర్యాదగా మాట్లాడారని.. ఆమె పార్కింగ్ ప్లేస్‌లో కోన్స్ పెట్టారని ఆరోపించారు. హయాతి ఒక సెలబ్రిటీ అని, డీసీపీకి చాలా సార్లు చెప్పినా వినకపోవడంతో అసహనంతో కోన్స్‌ను కాలితో తన్నారని వివరించారు. డీసీపీపై డింపుల్ కేసు పెడతానని చెప్పడంతో ఆమెపైనే కేసు పెట్టారన్నారు. వేధించాలి అనేదే డీసీపీ ఉద్దేశమన్న ఆయన.. రాహుల్ హెగ్డే తన క్వార్టర్స్‌లో ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.