Herion Seized: మహారాష్ట్రలోని ముంబయి పోలీసులు.. అంతర్జాతీయ మార్కెట్లో క్లెయిమ్ చేయని కంటైనర్ నుంచి 168 ప్యాకెట్లలో ఉన్న రూ.362.5 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముంబయి-పుణె హైవేకు ఆనుకుని ఉన్న రాయ్‌గఢ్ జిల్లాలోని యార్డ్‌లో కంటైనర్ పడి ఉందని అధికారులు తెలిపారు. మొదట స్వాధీనం చేసుకున్న పదార్థం మార్ఫిన్ అని అనుమానించామని, తర్వాత హెరాయిన్‌గా తేలిందని చెప్పారు.
అసోంలోని కరీంగంజ్ జిల్లాలో మాదక ద్రవ్యాల నిరోధక శాఖ, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన సోదాల్లో రూ.మూడు కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడింది. విశ్వసనీయ వర్గాల సమాచారంతో కరీంగంజ్ పోలీసులు అసోం-మిజోరం సరిహద్దులో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. గురువారం అర్ధరాత్రి బరైగ్రామ్ వద్ద పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న వాహనంపై అనుమానం వచ్చి అడ్డుకున్నారు. అనంతరం విస్తృత తనిఖీలు చేపట్టారు. సబ్బు పెట్టెల్లో ప్యాక్ చేసి, ఇంధన ట్యాంక్ లోపల, వాహన మడ్‌గార్డ్‌లో దాచిన 477 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే వాహన డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.
మరో చోట 122 కిలోల హెరాయిన్ స్వాధీనం.. అదే జిల్లాలో మరో చోట సోప్ బాక్సుల్లో తరలిస్తున్న 122 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నామని, వాటి విలువ రూ.80 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేశామని తెలిపారు.