Hemant Prachchhak Judge : మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల శిక్ష నిలుపుదలకు నిరాకరించిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచక్ బదిలీ కానున్నారు. బదిలీల కోసం సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా ప్రతిపాదించిన జాబితాలో జస్టిస్ హేమంత్ ప్రచక్ పేరు కూడా ఉంది. దీనికి సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు అధికారులు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్, సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. మెరుగైన పరిపాలన కోసమే న్యాయమూర్తుల బదిలీలకు సిఫారసు చేసినట్లు కొలీజియం పేర్కొంది. జస్టిస్ హేమంత్ ప్రచక్, జస్టిస్ సమీర్ దవే, జస్టిస్ గీతా గోపీతో పాటు మొత్తం 23 మంది న్యాయమూర్తులు పేర్లు బదిలీల జాబితాలో ఉన్నాయి.
Modi Surname Rahul: మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో.. తన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీగుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. రాహుల్ అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు జూలైలో కొట్టేసింది. ఈ కేసులో కిందికోర్టు విధించిన శిక్ష న్యాయపరమైనదని.. శిక్షను నిలిపివేసేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదని జస్టిస్ హేమంత్ ప్రచక్ అప్పట్లో తీర్పు వెలువరించారు. అందుకే పిటిషనర్ అభ్యర్థనను కొట్టివేస్తున్నట్లు తెలిపారు. జస్టిస్ ప్రచక్.. గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించినట్లు సమాచారం. అనంతరం గుజరాత్ ప్రభుత్వంలో అసిస్టెంట్ ప్లీడర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేసి.. 2021లో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు.