తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా బుగ్గల్ని భద్రంగా చూసుకోవాలేమో'.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై హేమ - hema malini comments

తన బుగ్గలను రోడ్లతో పోల్చడంపై భాజపా ఎంపీ హేమా మాలిని స్పందించారు. లాలూ ప్రసాద్​ యాదవ్​ ఈ ట్రెండ్​ మొదలుపెట్టారని, ప్రజాసేవలో ఉన్న వారు ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదన్నారు. ఇదే విషయంపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​.. అలాంటి వ్యాఖ్యలతో హేమా మాలినిని గౌరవిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అంతేకాని వాటిని తప్పుగా చూడకూడదని హితవు పలికారు.

hema malini news update
నా బుగ్గలను భద్రంగా చూసుకోవాలేమో: హేమా మాలిని

By

Published : Dec 20, 2021, 12:47 PM IST

Updated : Dec 20, 2021, 1:09 PM IST

మహారాష్ట్ర జల్​గావ్​లోని రోడ్లు.. హేమా మాలిని బుగ్గల్లా ఉన్నాయంటూ శివసేన నేత గులాబ్​రావ్​ పాటిల్​ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంపై హేమా మాలిని స్పందించారు.

"నేను నా బుగ్గలను భద్రంగా ఉంచుకోవాలేమో(నవ్వుతూ). కొన్నేళ్ల క్రితం లాలూ ప్రసాద్​ యాదవ్​ ఈ ట్రెండ్​ మొదలుపెట్టారు. ఆయన ఏదో అలా అనేసి ఉంటారు. కానీ అది మంచిగా అనిపించలేదు. ఇప్పటికీ అది కొనసాగుతోంది. సాధారణ విషయమైపోయింది. ఇలా చేయకూడదు. సాధారణ ప్రజలు ఇలా అంటే మనం ఏం చేయలేము. కానీ ఓ ఎంపీ, ప్రజాసేవలో ఉన్న వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాగోదు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు."

-- హేమా మాలిని, భాజపా ఎంపీ.

'అవి ప్రశంసలే...'

తాజా వ్యవహారంపై శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ స్పందించారు. తమ పార్టీ నేత వ్యాఖ్యలను తప్పుగా భావించాల్సిన అవసరం లేదన్నారు.

"ఇలాంటి వ్యాఖ్యలు గతంలోనూ విన్నాము. ఈ వ్యాఖ్యలు.. హేమా మాలిని గౌరవిస్తున్నట్టు. అంతే కానీ నెగిటివ్​గా ఆలోచించకండి. గతంలో లాలూ ప్రసాద్​ యాదవ్​ కూడా ఇలాంటి మాటలే అన్నారు. మాకు హేమా మాలిని అంటే గౌరవం ఉంది."

--- సంజయ్​ రౌత్​, శివసేన నేత.

ఇదీ జరిగింది...

బోధ్వాడ్ నగర్ పంచాయత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పాటిల్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

"30 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నవారు.. నా నియోజకవర్గానికి వచ్చి ఇక్కడి రోడ్లను చూడండి. అవి హేమా మాలిని బుగ్గల్లా లేకపోతే.. నేను రాజీనామా చేస్తాను" అని గులాబ్​రావ్ పాటిల్​ అన్నారు. మాజీ భాజపా నేత, జల్​గావ్ ఎమ్మెల్యే ఏక్​నాథ్ ఖాడ్సే లక్ష్యంగా పాటిల్​ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పాటిల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలీ చకాంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై క్షమాపణలు చెప్పకపోతే.. న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అయితే.. మహిళా కమిషన్ హెచ్చరించిన కొన్నిగంటల తర్వాత పాటిల్ క్షమాపణలు చెప్పారు. "నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. నా వ్యాఖ్యలకు నేను క్షమాపణలు చెబుతున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్​ సిద్ధాంతాలను పాటించే శివసేన పార్టీకి చెందిన నేతను నేను. మా పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్​ ఠాక్రే మాకు మహిళలను గౌరవించాలని బోధించారు" అని చెప్పారు.

గతనెలలో.. రాజస్థాన్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత రాజేంద్ర సింగ్‌ గుడా సైతం ఇదే తరహాలో మాట్లాడారు. తన నియోజకవర్గాల రహదారులు కత్రినా కైఫ్‌ బుగ్గల్లా ఉండాలని వ్యాఖ్యానించారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ చూడండి:-కత్రినా కైఫ్ బుగ్గల్లా మన రోడ్లు ఉండాలి: మంత్రి

Last Updated : Dec 20, 2021, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details