ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ) హెలికాప్టర్ కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. అది ఒక ఏఎల్‌హెచ్ ధ్రువ్ మాక్-3 శిక్షణ హెలికాప్టర్ అని తెలిపారు. హెలికాప్టర్‌ను పరీక్షిస్తున్న సమయంలోనే ప్రమాదానికి గురైందని చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్లో ముగ్గురు వ్యక్తులున్నారని.. అందులో ఓ వ్యక్తికి చేయి విరిగినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో జరిగింది. ప్రమాదం తర్వాత రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. అనంతరం రన్‌వేను పరీక్షించి మధ్యాహ్నం 2 గంటల సమయంలో విమాన రాకపోకలను పునరుద్ధరించినట్లు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
అంతకుముందు ఇక్కడకు వచ్చే విమానాలను తిరువనంతపురం, కొయంబత్తూర్ విమానాశ్రయాలకు మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు వివరించారు. సాధ్యమైనంత త్వరగా రన్‌వేను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. సైక్లిక్ కంట్రోల్స్ పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని.. పైలెట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి హెలికాప్టర్ కూలిందని చెప్పారు. హెలికాప్టర్ రోటార్స్, ఎయిర్‌ఫ్రేమ్ దెబ్బతిందని పేర్కొన్నారు.
ఆర్మీ హెలికాప్టర్ కూలి ఇద్దరు మృతి
ఇటీవలే ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూడా కుప్పకూలింది. మార్చి 16న అరుణాల్ ప్రదేశ్‌లోని మండలా పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మరణించిన పైలట్లను లెఫ్ట్‌నెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, మేజర్ ఎ. జయంత్‌గా గుర్తించారు. కాగా, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టనున్నామని చెప్పారు. మండలా పర్వత ప్రాంతంలో తూర్పు బంగ్లాజాప్ గ్రామ సమీపంలో విమాన శకలాలు లభించినట్లు చెప్పారు.