Helicopter Crash in Kochi Today :కేరళ కొచ్చిలో శిక్షణ హెలికాప్టర్ కూలి ఓ నేవీ అధికారి మరణించారు. శనివారం మధ్యాహ్నం ఐఎన్ఎస్ గరుడ రన్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. చేతక్ హెలికాప్టర్ శిక్షణలో భాగంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలినట్లు నేవీ అధికారులు తెలిపారు. రన్‌వే పై నిల్చున్న అధికారి మరణించగా.. హెలికాప్టర్‌లోని ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడిని యోగేంద్ర సింగ్‌గా గుర్తించారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడ రన్‌వేపై చేతక్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. నిర్వహణలో భాగంగా చేపట్టిన తనిఖీల్లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒక గ్రౌండ్ అధికారి మరణించారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాం.
--భారత నేవీ అధికారి
దీనిపై సమాచారం అందుకున్న కొచ్చి పోలీసులు, నేవీ అధికారులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ హెలికాప్టర్ డీకమీషన్కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది నేవీ. ప్రమాదానికి కారణం సాంకేతిక వైఫల్యమా? లేక వాతావరణ సమస్యా? అని దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఈ చేతక్ హెలికాప్టర్‌లో ఏడుగురు కూర్చునే అవకాశం ఉండగా.. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఇద్దరు ఉన్నారు.
కూలిన ఆర్మీ హెలికాప్టర్.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
అంతకుముందు జమ్ము కశ్మీర్లో ఓ ఆర్మీ హెలికాప్టర్ కూలగా.. ఒకరు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. కిష్త్వార్ జిల్లాలో సైన్యానికి చెందిన ALH ధ్రువ్ చాపర్.. ప్రమాదానికి గురై మరువా నది ఒడ్డున నేలను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో పైలట్, కో పైలట్, టెక్నీషియన్ హెలికాప్టర్‌లో ఉన్నారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రుల్ని ఉధంపుర్లోని ఆస్పత్రికి తరలించాయి. అయితే.. తీవ్రంగా గాయపడిన టెక్నీషియన్.. కాసేపటికి మరణించారు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని, ముందస్తుగా ల్యాండింగ్ చేస్తున్నామని పైలట్లు ముందుగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్- ఏటీసీకి సమాచారం ఇచ్చినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. అయితే.. పర్వత ప్రాంతం, నది ఒడ్డున కావడం వల్ల ఇలా హార్డ్ ల్యాండింగ్ జరిగిందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది.
ఎయిర్‌పోర్టులో కూలిన హెలికాప్టర్.. ల్యాండింగ్ సమయంలో..
విషాదం.. ఆర్మీ ఛాపర్ క్రాష్.. ఇద్దరు పైలట్లు మృతి