Delhi rains: దేశ రాజధాని దిల్లీని ఉరుములు, పిడుగులు, బలమైన గాలులతో కూడిన వర్షం కుదిపేసింది. తీవ్రమైన ఎండతో వేడెక్కిన నగరాన్ని సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా పెనుగాలులు చుట్టుముట్టాయి. గంటకు 100 కి.మీ. వేగంతో తుపానును తలపించాయి. ఆ వెంటనే ఉరుములు..కుండ పోతగా వర్షం... తూర్పు, సెంట్రల్ దిల్లీలోని పలు ప్రాంతాల్లో భీతావహమైన పరిస్థితులు నెలకొన్నాయి. చెట్లు వేళ్లతో సహా పెకిలించుకుపోయి రహదారులపై పడ్డాయి. విద్యుత్, ఇంటర్నెట్ కేబుళ్లు తెగిపడ్డాయి. కరెంటు సరఫరాకు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడినట్లు తెలిసింది. వాయవ్య రాజస్థాన్, పాకిస్థాన్ ఉపరితలాల మీదుగా నెలకొన్న తుపాను తరహా వాతావరణమే దిల్లీలో ఆకస్మిక గాలి వానకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి వీచిన తేమ గాలులు, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం కలగలిసి తుపాను తరహా పరిస్థితులను సృష్టించాయని వివరించింది. ఆకస్మిక వానతో నగరంలో సాయంత్రం 4.20 గంటల సమయంలో 40 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న ఉష్ణోగ్రత సాయంత్రం 5.40 గంటలకు 25 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటన్నర వ్యవధిలో సగటున 17.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 2018 తర్వాత ఇంత పెద్ద గాలివాన రావడం ఇదే ప్రథమమని వాతావరణ శాఖ తెలిపింది.
ఇల్లు కూలి ఒకరు...చెట్టుపడి మరొకరు..
సెంట్రల్ దిల్లీలోని జామా మసీదు ప్రాంతంలో పొరుగింటి బాల్కనీ కూలి 50 ఏళ్ల వ్యక్తి ఒకరు మృతి చెందారు. ఉత్తర దిల్లీలోని అంగూరిబాగ్‌లో రావి చెట్టు కూలడంతో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. చారిత్రక జామా మసీదు గుమ్మటం బీటలు వారింది. కట్టడంలోని కొన్ని రాళ్లు కదిలి కిందకు పడిపోయాయని షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ తెలిపారు. మినార్‌ల నుంచి రాళ్లు ఊడిపడడంతో ఇద్దరు గాయపడ్డారని చెప్పారు.
- చెట్లు విరిగి రహదారులపై పడిపోయినట్లు సోమవారం రాత్రి 8 గంటల వరకు 294 ఫిర్యాదులు, ఇళ్లు కూలినట్లు 8 ఫిర్యాదులు వచ్చినట్లు దిల్లీ అగ్నిమాపక విభాగ పోలీసులు తెలిపారు.
- పశ్చిమ దిల్లీ భాజపా ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ కారుపై చెట్టు కొమ్మలు విరిగిపడడంతో ఆ వాహనం ధ్వంసమయ్యింది.
- తీవ్రమైన గాలి వాన కారణంగా కనీసం అయిదు విమానాలను దారి మళ్లించారు. 70 విమాన సర్వీసుల రాకపోకల్లో జాప్యం జరిగిందని అధికారులు తెలిపారు.
- లూటినీస్ దిల్లీ, ఐటీఓ, కశ్మీరీ గేట్, ఎంబీ రోడ్, రాజ్‌ఘాట్ తదితర ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
- గాలి తీవ్రత ధాటికి పార్లమెంటు వీధిలోని ఓ భవనం నుంచి ఏసీ కంప్రెషర్లు ఊడిపడి కార్లు, ఆటోరిక్షాలు దెబ్బతిన్నాయి.
- ట్రాఫిక్‌లో చిక్కుకు పోయిన పలువురు వాహనదారులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఇబ్బందులను పోలీసుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
- దర్యాన్‌గంజ్, నిజాముద్దీన్, లజపత్ నగర్, పంచశీల్ పార్క్, రోహిణి, పహర్‌గంజ్ తదితర ప్రాంతాల నుంచి చెట్లు కూలిపోయాయనే ఫిర్యాదులు అధికంగా వచ్చాయి.