Nizamabad District Rains : నిజామాబాద్ జిల్లాలో కుండపోత వాన కురిసింది. కేవలం ఆరు గంటల్లోనే... అల్లకల్లోలం సృష్టించింది. నిన్న రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమై ఏకధాటిగా తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు అతి భారీవర్షం కురిసింది. వేల్పూర్‌లో ఏకంగా 46.3 సెంటీమీటర్ల రికార్డు స్థాయి... వర్షపాతం నమోదైంది. ఆర్మూర్ మండలం పెర్కిట్ లో 33.1, భీంగల్ లో 26.4, కమ్మర్‌పల్లి మండలం కోనసముందర్‌లో 22.6, జక్రాన్‌పల్లిలో 22.2, డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లిలో 17.2, మోర్తాడ్‌లో 11.2, ధర్పల్లిలో 9.7, ఆలూర్‌లో 8.7, ఆలూర్ మండలం మచ్చెర్లలో 8.3, నిజామాబాద్ నార్త్ మండలం గూపన్‌పల్లిలో 8.2, ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలో 8 సెం.మీ.ల వర్షాపాతం నమోదైంది.
Heavy Rains in Nizamabad : నిజామాబాద్ జిల్లాలో వర్షంబీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్‌లో... తీవ్ర ప్రభావం చూపింది. 7 చెరువులకు గండ్లుపడగా, 6 చోట్ల ఆర్అండ్‌బీరోడ్లు, 14 పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. పలుగ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతం నుంచి వరద, చెరువులు తెగిపోవటంతో వేలాదిఎకరాల్లో పంటపొలాలు నీట మునగటంతో పాటు ఇసుక మేటలేశాయి. వేల్పూర్‌లో సోమవారం అర్ధరాత్రి వేళ వరద నీరు ఇళ్లలోకి చేరటంతో ప్రజలను పంచాయతీ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక మదర్సాలోని 40 మంది పిల్లలను... సమీపంలోని షాదీఖానాలోకి తరలించారు. పలుచోట్ల 43 పాత ఇళ్లు... పాక్షికంగా దెబ్బతిన్నాయి. లోలెవల్ వంతెనలు, జాతీయ రహదారులపై వరదనీరు పారుతోంది.
Heavy Rainfall at Velpur in Nizamabad : వేల్పూర్ మీద వర్షం పెను ప్రభావం చూపింది. మర్సకుంట చెరువు తెగి... గ్రామానికి వచ్చే రోడ్డుపై పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీస్‌స్టేషన్, తహశీల్దార్, ఐకేపీ భవనం, రైతు వేదిక, గ్రామాభివృద్ధికమిటీ భవనాల చుట్టూ నీళ్లు చేరాయి. ఇలాంటివర్షంఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. వర్షాల వల్ల వేల్పూరులోని మర్సకుంట చెరువు, కాడి చెరువులతో పాటు పచ్చలనడకుడ, జానకంపేట, పడగల్ నవాబ్ చెరువు కట్టలు... తెగిపోయాయి. పచ్చలనడకుడ చెరువు తెగి వరద ప్రవాహానికి ఆర్అండ్‌బీ రోడ్డు ఐదడుగుల లోతుతో కోతకు గురైంది. పడగల్ చెరువు తెగటంతో రోడ్డు దెబ్బతింది. వెంకటాపూర్- కోసమనపల్లి రోడ్డు.. కొట్టుకుపోయింది. అంకాపూర్ పోచంపల్లి మధ్యలో మత్తడి వాగు ఉద్ధృతికి... రహదారి కోతకు గురైంది.