ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెన్నై నగరంలో పలు చోట్ల కార్పొరేషన్ అధికారులు మోటార్ పంపుల సాయంతో వరద నీటిని డ్రైనేజీలోకి మళ్లించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తెల్లవారుజామునే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది బలహీనపడుతుందని, రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. తమిళనాడులోని కృష్ణగిరి, ధర్మపురి జిల్లాలకు వర్షం ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను అప్రమత్తం చేసింది. కర్ణాటక, పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
కర్ణాటక అప్రమత్తం..
ఇప్పటికే వరదలతో అతలాకుతలమైన కర్ణాటకకు.. వచ్చే నాలుగు రోజులు కూడా వర్ష ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంత జిల్లాలు, దక్షిణ కన్నడ ఉడుపి, ఉత్తర కన్నడ, బెల్గాం, ధర్వాడ్, గడగ్, హవేరి, చామరాజనగర్, మైసూరు జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ చేసింది. బెంగళూరు, దక్షిణ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో బెంగళూరు అర్బన్ డిప్యూటీ కలెక్టర్ శుక్రవారం, శనివారం పాఠశాలలను మూసివేస్తున్నట్లు తెలిపారు. బెంగళూరు రూరల్, కోలర్, చిక్కబళ్లపుర, రామనగర, తుముకూరు, చామరాజనగర్లో పాఠశాలలతో పాటు, కాలేజీలకు కూడా సెలవులు ఇచ్చారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
కొట్టుకుపోయిన బైక్...
కర్ణాటక తుమ్కూరులో వరద ఉద్ధృతి పెరిగి ఓ బైక్ కొట్టుకుపోయింది. వంతెన దాటుతుండగా ఒక్కసారిగి ప్రవాహం పెరిగి ఈ ఘటన జరిగింది. బైక్ యజమాని సహా మరో ఇద్దరు కలిసి దాన్ని కొట్టుకుపోకుండా ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే వారు మాత్రం క్షేమంగానే బయటపడ్డారు. ఈ ప్రాంతంలోనే వరదలో చిక్కుకున్న పులువురిని స్థానికులు రక్షించారు.