Heavy Rains in Joint Warangal District :కుండపోత వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుప్రాంతాలు చివురుటాకులా వణుకుతున్నాయి. త్రినగరిలో లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. చారిత్రక నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్‌లోని డీకేనగర్, ఎన్టీఆర్‌నగర్, గణేశ్‌నగర్, సంతోషిమాతానగర్, వివేకానందకాలనీ, సుందరయ్యనగర్‌లు ముంపులోనే ఉన్నాయి. కాశీబుగ్గ పరిధిలోని పలు కాలనీల ప్రజల్ని పునరావాస కేంద్రానికి తరలించారు. భారీ వర్షాలకు నేల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను విపత్తు నిర్వహణ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.
పాత బీట్ బజార్ వద్ద మురుగు కాల్వల్లోకి చెత్త చేరడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దుకాణాల్లోకి డ్రైనేజ్ నీరు పోటెత్తుతోంది. పాత బీట్‌బజార్, బట్టల బజార్ ప్రాంతంలో ఏటా వర్షం వస్తే వ్యాపారాలు బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు వరద కాల్వలకు మరమ్మతు చేయాలని కోరుతున్నారు. బీట్ బజారుతో పాటు బట్టల బజార్ ప్రాంతాన్ని వరంగల్ మేయర్ గుండు సుధారాణి సందర్శించి దుకాణ యాజమానులకు భరోసా కల్పించారు. వర్షాలు తగ్గగానే కాలువల నిర్మాణ పనులు వేగంగా చేస్తామని దుకాణదారులకు హామీ ఇచ్చారు.
వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో వరద నీరు చేరి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చెరువులు, కుంటలు వర్షపునీటితో నిండుకుండల్లా మారగా.. ఇలాగే భారీ వర్షాలు పడితే చాలాచోట్ల కట్టలు తెగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. హనుమకొండ-ములుగు ప్రధాన రహదారిపై ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువు అలుగు ఉద్ధృతంగా పారుతోంది. ప్రవాహ వేగం పెరిగినందున వాహన రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి.
Rains in Mahabubabad : భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో చెరువులు అలుగులు పారుతున్నాయి. గూడూరు మండలం కొమ్ముల వంచ శివారులో భీముని పాదం జలపాతం ఉద్ధృతంగా జాలువారుతోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం, గంగారం మండలాల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క విస్తృతంగా పర్యటించారు. వంతెనలపై నుంచి పారుతున్న వరద పరిస్థితిని పరిశీలించారు. ముంపు ప్రజల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. భూపాలపల్లి జిల్లా ఘనపూర్‌లో మోరంచ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బుద్దారంలో వంగపల్లి చెరువు అలుగుపోస్తోంది. టేకుమట్ల మండలం వెలిశాలలో చెరువు మత్తడి పోస్తోంది. సింగరేణిలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
Heavy Rains in Joint Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెగని వర్షాలతో ప్రధాన జలాశయాలు, తాగునీటిప్రాజెక్టులకు వరద తాకిడి అంతకంతకు పెరుగుతోంది. ప్రాణహితతో పాటు ఎల్లంపల్లి, తాలిపేరు ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో.. భద్రాచలం వద్దగోదావరినీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. ప్రవాహం 46.7 అడుగులకు చేరడంతో భద్రాచలం వద్ద జిల్లా యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. గోదావరి ఉగ్రరూపంతో దుమ్ముగూడెం మండలం గంగోలు-లక్ష్మీనగరం రోడ్డుపైకి వరద చేరి...వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.