Bangalore Rain : బెంగళూరును మరోసారి కుండపోత వాన ముంచెత్తింది. తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంతంలో వర్ష ప్రభావం తీవ్రంగా కనిపించింది. రాజమహల్‌గుట్టహల్లిలో గరిష్ఠంగా 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దారులన్నీ చెరువులుగా మారాయి. వరద ఉద్ధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. అనేక మంది గాయపడ్డారు. బెంగళూరు-పుణె జాతీయ రహదారిపై పూర్తిగా నీరు నిలవడం వల్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి నీరు చేరింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షానికి ట్రాఫిక్ స్తంభించింది. కుండపోత వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఐటీ కంపెనీలు ఉన్న ప్రాంతం మొత్తం నీట మునిగింది. కొన్ని ప్రాంతాల్లో గాలులకు విద్యుత్ వైర్లు తెగిపోయాయి. అక్రమ కట్టడాల మూలంగానే నగరంలో చిన్న వర్షం కురిసినా ముంపునకు గురవుతుందని ఇంజినీరింగ్ నిపుణులు ఇచ్చిన నివేదికలతో ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.