Hyderabad Rains Today : హైదరాబాద్‌లో వారం రోజులుగా వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని కొన్ని కాలనీలు ఇప్పటికి జల దిగ్బంధంలోనే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ విభాగం.. ఇలా ప్రతి శాఖకు ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 24 గంటలూ క్షేత్రస్థాయిలో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నామని సిబ్బంది చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది.
పలు బస్తీలు, కాలనీల్లో విద్యుత్ లేకపోవడం.. మంచి నీరు కలుషితం కావడం సహా అనేక చోట్ల కాలు తీసి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా కుత్బుల్లాపూర్‌లోని పలు కాలనీల్లో మోకాలి లోతు వర్షం నీరు చేరి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పలు డివిజన్లలో వరద నీటితో రోడ్లు దెబ్బతిని గుంతలు గుంతలుగా మారాయి. వోక్షిత్ ఎన్‌క్లేవ్, ఆదర్శనగర్, దేవేందర్‌నగర్, కైసర్‌నగర్, గాజుల రామారంలో ప్రజలు ఇప్పటికి నీళ్లలోనే ఉన్నారు. డ్రైనేజీ మూతలు తెరవడంతో పనులకు వెళ్లేవారు.. పాఠశాలకు వెళ్లే పిల్లలు భయం భయంగా ముందుకు అడుగేయాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు.
People in Trouble Due to Rains in Hyderabad :ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ వ్యాప్తంగా మురుగు పొంగి పొర్లుతోంది. 6 రోజుల్లో జలమండలికి మురుగు సమస్యపై 6,000 పైగా ఫిర్యాదులు అందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రతి డివిజన్‌కు 2 ఎయిర్‌టెక్ యంత్రాలు, అత్యవసర వాహనాలు, ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు జలమండలి అధికారులు ప్రకటించారు. కానీ, క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్నారు. అధిక వర్షాల కారణంగా వస్తోన్న నీరు రంగుమారినా, వాసన వచ్చినా ఆ నీటిని తాగకుండా వెంటనే 155313కు సమాచారం అందించాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు.
Heavy Rains in Hyderabad : వర్షాల కారణంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో రహదారుల నీరు.. బస్తీల్లోని ఇళ్లలోకి చేరుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనోహర్ థియేటర్, సెకండ్ బజార్లోని డొక్కలమ్మ దేవాలయం, అంబేడ్కర్ నగర్, చిలకలగూడ, బోయిన్‌పల్లి, మారేడుపల్లి లోని ప్రాంతాలలో 4 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలతో భాగ్యనగరంలో విద్యుత్ సరఫరాలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి.
"రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. డ్రైనేజీ మూతలు తెరవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొవాలని కోరుతున్నాం." - రాజేశ్వరి, సికింద్రాబాద్