Assam Rains: ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అసోంలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 55కి చేరినట్లు.. అసోం విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. మరోవైపు హోజాయ్ జిల్లాలోని ఇస్లామ్‌పూర్‌లో.. వరద బాధితులను తరలిస్తున్న పడవ బోల్తాపడి ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. 21 మందిని.. అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్‌లోనూ..బ్రహ్మపుత్ర, బరాక్ నదులు, వాటి ఉపనదుల ఉగ్రరూపంతో.. అసోంలోని 2,930 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. 43,338 హెక్టార్ల మేర పంట నష్టం సంభవించింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లోనూ వరదల ప్రభావం అధికం ఉంది.పలు గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. కొండ చరియలు విరిగిపడి, రోడ్లు ధ్వంసమయ్యాయి. మేఘాలయలో ఇప్పటి వరకూ 18 మంది చనిపోయారు.
చేపలు పట్టుకుంటున్న ప్రజలు.. రంగియా పట్టణంలోని జాతీయ రహదారి ఓ వైపు నీటమునగ్గా స్థానికులు వలలు వేసి చేపలు పట్టేందుకు వచ్చారు. రహదారి ఒకవైపు మునిగిపోగా.. మరో వైపు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.