పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలోని చిచాభక్నా గ్రామంలో పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితుల ఆ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకోగా.. నిందితులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో అధికారులు జరిపిన ఎదురుకాల్పులు ఇద్దరు గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. మృతులను జగ్‌రూప్ సింగ్ రూపా, మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మన్నుకుస్సాగా పోలీసులు గుర్తించారు. వారి నుంచి ఏకే 47, పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సుమారు ఐదు గంటల పాటు ఈ కాల్పులు జరిగాయి. జగ్‌రూప్ సింగ్ తొలుత మరణించగా నాలుగు గంటల తర్వాత మన్నుకుస్సా కూడా హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ వార్తను అందించేందుకు వెళ్లిన ఓ ఛానల్ కెమెరామెన్ కాలికి కూడా బుల్లెట్ గాయమైంది.