President election cross voting: 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు అంచనా వేసిన దాని కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. విపక్షాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆమెకు జైకొట్టడమే ఇందుకు కారణం. రాష్ట్రపతి ఎన్నికలో పార్టీలు విప్ జారీ చేసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది. విపక్ష పార్టీలకు చెందిన దాదాపు 125 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ద్రౌపదీ ముర్ముకు మద్దతునిచ్చినట్లు తెలుస్తోంది.
కేరళలో భారతీయ జనతా పార్టీకి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. అక్కడ అధికార పక్షం ఎల్డీఎఫ్, విపక్షం యూడీఎఫ్ రెండూ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే మద్దతునిచ్చాయి. అయినా కేరళలో పోలైన 140 ఓట్లలో ఒక ఓటు ద్రౌపదీ ముర్ముకు పడటం గమనార్హం. అసోంలో విపక్షానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ద్రౌపదీ ముర్ముకు ఓటేశారు. అసోం అసెంబ్లీలో 126 మంది సభ్యులు ఉండగా అక్కడ భాజపా బలం 79. కానీ ద్రౌపదీ ముర్ముకు అసోంలో 104 ఓట్లు వచ్చాయి. అసోంలో ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఈ సందర్భంగా సీఎం హిమంత్ బిశ్వ శర్మ ట్వీట్ చేశారు.
మధ్యప్రదేశ్‌లో ద్రౌపదీ ముర్ముకు అదనంగా 16 ఓట్లు వచ్చాయి. అక్కడ ముర్ముకు 146, యశ్వంత్ సిన్హాకు 79 ఓట్లు పోలయ్యాయి. భాజపా ఎమ్మెల్యేల సంఖ్య కంటే ద్రౌపదీ ముర్ముకు ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆత్మసాక్షి ప్రకారం ఓటేసిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో సందేశం విడుదల చేశారు. పశ్చిమ బంగాల్‌లో భాజపాకు 69 మంది ఎమ్మెల్యేలే ఉండగా అక్కడ ద్రౌపదీ ముర్ముకు 71 ఓట్లు రావడం గమనార్హం. సొంత రాష్ట్రం ఝార్ఖండ్‌లోనూ యశ్వంత్ సిన్హా.. విపక్ష ఎమ్మెల్యేల అన్ని ఓట్లు దక్కించుకోలేకపోయారు. ఝార్ఖండ్‌లోని 81 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 9 మందే యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికారు.