పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఆదివారమే జరగాల్సి ఉంది. అయితే, కొవిడ్ నేపథ్యంలో కౌంటింగ్ విధులకు హాజరు కావావాల్సిన ఉపాధ్యాయులు వెనుకాడుతున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై నేడు కోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. ఎట్టకేలకు కొవిడ్ నిబంధనల్ని పాటిస్తామన్న ఎన్నికల సంఘం హామీ మేరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.
'ఓట్ల లెక్కింపు 2-3 వారాలు వాయిదా వేస్తే ఆకాశమేమైనా విరిగిపడుతుందా?' అంటూ న్యాయస్థానం యూపీ ఎన్నికల సంఘాన్ని ఘాటుగా ప్రశ్నించింది.
"పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ.. ముందుకు వెళ్లదలచుకున్నారా? 2-3 వారాల తర్వాత వైద్య పరిస్థితులు మెరుగయ్యాక లెక్కింపు జరపలేరా? ఇన్ని ఇబ్బందులు ఉన్నా ముందుకు వెళ్లాలనుకుంటున్నారా? మూడు వారాలు వాయిదా వేస్తే ఆకాశమేమీ విరిగిపడదు" అంటూ కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం కౌంటింగ్ జరిపాలని నిర్ణయించుకున్నామని తేల్చి చెప్పింది.