గత కొద్దిరోజులుగా సూర్యుడి ప్రతాపంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. దేశంలో హీట్ వేవ్ ముగిసిందని తెలిపింది. బుధవారం నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది.
"దేశంలో హీట్ వేవ్ ముగిసింది. బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. రాజస్థాన్, పంజాబ్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, చండీగఢ్‌లో తుఫాను సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఆ రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశాం. రాబోయే 2-3 రోజుల పాటు కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది" అని IMD శాస్త్రవేత్త ఆర్‌కే జెనామణి తెలిపారు. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 24,25,26 తేదీల్లో దేశవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
అయితే దేశ రాజధాని దిల్లీలో ఉష్ణోగ్రతలు.. గురువారం 35 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జూన్ 30 వరకు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో దిల్లీ వాసులు.. భారీగా 6,916 మెగావాట్ల విద్యుత్‌ను వాడేశారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధిక వాడకమని అధికారులు తెలిపారు. దిల్లీలో గత వేసవిలో గరిష్ఠంగా 7,695 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందని.. ఈ ఏడాది అది 8,100 మెగావాట్లకు చేరుకోవచ్చని వారు తెలిపారు.