Heart Disease Treatment With Religious Books : గుండె సంబంధిత రోగాల్లో ఒత్తిడిని చాలా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు వైద్యులు. ఆ ఒత్తిడిని తగ్గించేందుకే చికిత్స చేస్తూ మందులు అందిస్తారు. ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు మాత్రం వినూత్నంగా మత గ్రంథాలతో చికిత్స అందిస్తున్నారు. రామాయణం, హనుమాన్ చాలీసా లాంటి పుస్తకాలతో గుండె వైద్యం చేస్తున్నారు. వీటిని చదివిన రోగుల ఆరోగ్యం మెరుగుపడినట్లు చెబుతున్నారు. ఓ వైపు మందులతో రోగులకు చికిత్స అందిస్తూనే, మరోవైపు మత గ్రంథాల సాయాన్ని తీసుకుంటున్నామని చెప్పారు వైద్యుడు నీరజ్.
"గుండె సంబంధిత సమస్యతో ఓ రోగి ఆస్పత్రికి వచ్చాడంటే, అతడి మనసులో గందరగోళం ఉంటుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. ఒత్తిడి కూడా పెరిగి గుండె వేగంగా కొట్టుకుంటుంది. వీటి వల్ల సమస్య తీవ్రతరం అవుతుంది. ఇంతకుముందు రోగులకు మానసిక థెరపీతో పాటు సంగీతం వినమని చెప్పేవాళ్లం. కానీ అది అంతగా ప్రభావం చూపలేదు. ప్రజలు మతం, ఆధ్యాత్మిక అంశాల పట్ల చాలా నమ్మకంగా ఉంటారు. అలాంటి వారికి ఆ పుస్తకాలు ఇచ్చి చికిత్స ఎందుకు అందించకూడదు అని ఓ రోజు ఆలోచన వచ్చింది. వెంటనే భగవద్గీత, హనుమాన్ చాలీసా, రామాయణం లాంటి గ్రంథాలను ఇవ్వడం మొదలుపెట్టాను. ఇది చాలా మంచి ఫలితాలను ఇచ్చింది. ఆధ్యాత్మిక అంశాల వైపు రోగులు దృష్టి మరలడం వల్ల వారిలో ఒత్తిడి తగ్గింది. ఇది చికిత్సలో ఎంతో ఉపయోగపడుతుంది."
--నీరజ్, సీనియర్ కార్డియాలజిస్ట్